పెళ్లి వేడుకల సమయంలో టెర్రస్ కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ లోని సరోజినినగర్ జిల్లోలో చోటు చేసుకుంది.
అప్పటి వరకు పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం అంతా ఒక్క సారిగా విషాదంగా మారిపోయింది. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు, చిన్నారుల ఆట పాటలతో కలకలలాడిన ఆ ఇళ్లు.. కొంత సమయంలోనే మూగబోయింది. వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. మరో పది మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీ సరోజినీనగర్‌లోని బిజ్నౌర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నార్డిఖేడాలో జగదీష్ యాదవ్ మేనకోడలు మనీషా యాదవ్ వివాహం గురువారం జరిగింది. అయితే ఆ పెళ్లి ఊరేగింపు రాత్రి పది గంటలకు ఇంటి వద్దకు చేరుకుంది. అయితే ఆ పెళ్లి ఊరేగింపును, వరుడిని చూసేందుకు ఆ ఇంటి టెర్రస్‌పైకి ఎక్కారు. ఊరేగింపు గేటు దగ్గరకు రాగానే టెర్రస్ పైన ఉన్న మహిళలంతా బాల్కనిలోకి వచ్చారు. దీంతో అది ఒక్క సారిగా కూలిపోయింది.
బాల్కనీ కూలిన పోయిన వెంటనే దానిపైన పదుల సంఖ్యలో ఉన్నమహిళలు కింద పడిపోయారు. అదే సమయంలో కింద ఉన్న ఊరేగింపు, బాల్కనీ కింద నిలబడి ఉన్న అమ్మాయి తరపు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఎక్కడ చూసినా పెళ్లి పాటకు బదులు అరుపులు వినిపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత గుమ్మంలో నిలబడిన వ్యక్తులు క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో పెళ్లికి వచ్చిన 45 ఏళ్ల రామ్ కిషోర్ తివారీ, 5 ఏళ్ల శ్రద్ధ చనిపోయారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే టెర్రస్ కుప్పకూలడానికి కారణమేమిటో పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ‘‘ సరిగ్గా నిర్మించని గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. కొన్ని నిమిషాల్లో అంతా అయిపోయింది ’’ అని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షి విశ్వాస్ సింగ్ చెప్పారు.
ఈ ప్రమాదం తెలిసిన వెంటనే బిజ్నౌర్ SHO రాజ్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన జరిగిన ఇళ్లు జగదీష్ యాదవ్‌కు చెందినదని, ఆయన మేనకోడలు వివాహంలో ఇది చోటు చేసుకుందని అన్నారు. స్థానికుల సహాయంతో బాధితులందరినీ రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించినట్లు రాజ్‌కుమార్ తెలిపారు.
