ఆ కుమారుడు ప్రతి రోజూ తాగి వచ్చి తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేసేవాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శరీరకంగా హింసించేవాడు. విసిగిపోయిన తల్లిదండ్రులు అతడిని హత్య చేసి పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు.
యుక్త వయసుకు ఎదిగిన బిడ్డలు తమకు చేదోడువాదోడుగా ఉంటారని ఏ తల్లిదండ్రులైనా ఆశిస్తారు. జీవితంలో స్థిరపడితే ఎంతో సంతోషిస్తారు. మంచి లైఫ్ లీడ్ చేస్తుంటే చూసి ఆనందిస్తారు. కానీ పాతికేళ్లు దాటినా, మంచీ చెడూ ఏంటనే విషయాలు తెలిసే వయస్సు వచ్చిన ఆ కుమారుడు ఇంకా మూర్ఖంగా ప్రవర్తించాడు. తాగుడుకు బానిసై తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టాడు. తాగివచ్చి ఇంట్లో గొడవలు చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేశాడు. బూతులు తిడుతూ.. శారీరకంగా కూడా హింసించాడు. ఎంతో ఓపికతో నచ్చజెప్పినా కొడుకు వినకపోయే సరికి ఆ తల్లిదండ్రులు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అతడిని హత్య చేసి నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఈ విషయం చెప్పారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
Rahul Gandhi: "ప్రధాని ల్యాబ్ లో కొత్త ప్రయోగం.. ప్రమాదంలో దేశ భద్రత, యువత": రాహుల్ గాంధీ
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు మదురైలోని చొక్కలింగ నగర్ మెయిన్ రోడ్డుకు చెందిన ఎ నాగరాజన్ (56), ఎన్ కురువామ్మాళ్ (50) లకు ఇద్దరు కుమారులు. ఇందులో చిన్న కుమారుడు ఎన్ మారిసెల్వం (27) నిరుద్యోగి. కొంత కాలం నుంచి తాగుడుకు బానిస అయ్యాడు. నిత్యం తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. తాగడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. దుర్భాషలాడుతూ, శారీరకంగా కూడా హింసించేవాడు.
చాలా కాలం నుంచి ఈ టార్చర్ భరించిన తల్లిదండ్రులకు ఓపిక నశించింది. కుమారుడిని తాడుతో గొంతు నులుమి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం నాగరాజన్, కురువమ్మాళ్ దంపతులు కలిసి ఎస్ ఎస్ కాలనీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ కుమారుడిని చంపేశామని చెప్పి లొంగిపోయారని ‘టైమ్స్ నౌ‘ ఓ కథనంలో నివేదించింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.
Droupadi Murmu To Take Oath: రేపే ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం..
ఇలాంటి ఘటనే ఈ ఏడాది ఏప్రిల్ లో సిరిసిల్ల జిల్లాలోని కోనారావుపేట లో జరిగింది. ధర్మారం గ్రామానికి చెందిన బాలయ్య గౌడ్, లావణ్య దంపతుల రెండో కుమారుడు నిఖిల్ (23) డ్రైవర్ గా పని చేసేవాడు. అయితే కొంత కాలం గల్ఫ్ దేశాల్లో పని చేసి ఇంటికి వచ్చాడు, అప్పటి నుంచి ఇక్కడే డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులందరినీ తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడు. డబ్బులు కావాలని తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఆ యువకుడికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా నిఖిల్ మారలేదు. అదే ప్రవర్తనను కొనసాగించాడు. దీంతో అతడి వికృత చేష్టలను వారు భరించలేకపోయారు. అయినా వారు ఓపికపడుతూ వచ్చారు.
ఈ క్రమంలో ఓ రోజు రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లిన నిఖిల్ కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. అల్లరి చేయకుండా పడుకోవాలని కుమారుడికి తండ్రి బాలయ్య చివాట్లు పెట్టాడు. దీంతో నిఖిల్ కు కోపం వచ్చింది. తండ్రిపై రోకల బండ తీసుకొని దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు బాలయ్యగౌడ్ నిఖిల్ నుంచి రోకలి బండను లాక్కొని అతడిపై దాడి చేశాడు. కుమారుడు తమపై మళ్లీ దాడికి పాల్పడతాడనే భయంతో బాలయ్య గౌడ్ తన భార్య లావణ్య, మరో ఇద్దరు కుమారులు వంశీ, అజయ్‌తో కలిసి నిఖిల్ను గట్టిగా పట్టుకున్నారు. అనంతరం గొంతుకు తాడును బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
