పాకిస్తాన్ పౌరసత్వం పొందిన వారి సంఖ్య 2019 నుంచి 2021 మధ్య చూసుకుంటే అనూహ్యంగా పెరిగింది. 2019లో ఈ సంఖ్య సున్నాగా ఉంటే 2021లో 41కి చేరింది.
న్యూఢిల్లీ: పొరుగు దేశాల నుంచి భారత్‌లోకి వచ్చే శరణార్థులకు పౌరసత్వం గురించి చాలా చర్చించుకున్నాం. అలాగే, పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చిన వార్తలూ చదివాం. కానీ, పాకిస్తాన్ పౌరసత్వం పొందిన భారతీయుల గురించిన విషయాలు చాలా తక్కువగా చర్చలో ఉంటాయి. తాజాగా, ఈ విషయంపై ది ప్రింట్ న్యూస్ పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం, 2019లో పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్న భారతీయుల సంఖ్య శూన్యం. కానీ, 2020లో ఈ సంఖ్య ఏడుకు చేరింది. 2021 వచ్చే సరికి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021లో పాకిస్తాన్ పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య 41కు చేరింది.
భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. భారతీయులు ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటే.. తప్పకుండా భారత పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
2021లో పాకిస్తాన్ పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య పెరగడానికి గల కారణాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా పాకిస్తాన్ పౌరసత్వం తీసుకుంటున్నవారిలో ఎక్కువ మంది భారతీయులు పెళ్లి చేసుకుని సరిహద్దు దాటినవారే ఉన్నారు. అంటే.. భారతీయులు కొందరు సరిహద్దుకు ఆవల ఉన్న బంధువులు, ఆప్తులు, పరిచయస్తుల కుటుంబాల అబ్బాయితో పెళ్లి చేసుకోవడం. తద్వార పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న భారత అమ్మాయి తన పౌరసత్వాన్ని త్యజించాల్సి వస్తుంది. అలాగే, పాకిస్తాన్ పౌరసత్వం పొందాల్సి ఉంటుంది.
పెళ్లి చేసుకుని పాకిస్తాన్ వెళ్లిపోయిన భారత వనిత అక్కడ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటారు. వారి దరఖాస్తులపై నిర్ణయం భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలపైనా ఆధారపడి ఉంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పుడు ఈ పౌరసత్వ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటాయి.
పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు వంటి అంశాలు పౌరసత్వ దరఖాస్తులకు అనుమతులను జటిలం చేశాయి. ఈ రెండు దేశాలు పొరుగు దేశస్తులు చేసిన పౌరసత్వ దరఖాస్తులను చాలా పరిశీలించి అనుమతించాయి. లేదా వాటిని చాలా కాలం పెండింగ్‌లోనే పెట్టాయి. ఈ కారణంగానే పౌరసత్వం పొందిన వారి సంఖ్య ఒక సంవత్సరంలో సున్నా ఉన్నా.. ఇతర సంవత్సరాల్లో పెరిగాయి.
అయితే, 2019తో పోల్చితే 2021లో పాకిస్తాన్ పౌరసత్వం పొందిన వారి సంఖ్య పెరగడానికి గల కాఱణాలను పరిశీలిస్తే.. గత రెండు మూడు సంవత్సరాల విషయానికి వస్తే.. పెండింగ్ అప్లికేషన్‌లను క్లియర్ చేయడం మూలంగా ఈ సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి కన్వాల్ సిబల్ వివరించారు. పాకిస్తాన్ పౌరసత్వం కోసం భారతీయులు చేసుకునే దరఖాస్తులు అనుమతి పొందడానికి కొంత ఎక్కువ సమయమే పడుతుందని తెలిపారు. ఈ సంఖ్య పెరగడానికి మరో అంశం గల్ఫ్ రీజియన్ అని చెప్పారు. పాకిస్తాన్, భారత పౌరులు గల్ఫ్ రీజియన్‌లో ఎక్కువగా కలుసుకుంటున్నారని వివరించారు.
