జ్ఞానవాపి వద్దకు శుక్రవారం రోజు ప్రార్థనల కోసం రాకూడదని, భక్తులు తమ పరిధిలోని మసీదుల్లో ప్రస్తుతానికి ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఇంతేజామియా మసీదు కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. అయితే ఈ లేఖ పెద్దగా ప్రభావం చూపలేదు. భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి రావడంతో కొంత గందరగోళం నెలకొంది.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ శుక్రవారం ప్రార్థనల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో మసీదు వద్దకు రావద్దని, వారి వారి ప్రాంతాలలో ప్రార్థనలు చేయాలని కోరింది. శివలింగం కనిపించిన వాజుఖానా (అబ్లూషన్ ట్యాంక్)లోకి ప్రవేశించడంపై మే 16న జారీ చేసిన కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ మసీదు కమిటీ జాయింట్ సెక్రటరీ SM యాసిన్ శుక్రవారం ప్రార్థనలకు ముందు ఈ విజ్ఞప్తి చేశారు.
gyanvapi masjid case : సుప్రీం సంచలన ఆదేశాలు.. విచారణ వారణాసి జిల్లా కోర్టుకి బదిలీ
అయితే ఈ విజ్ఞప్తిని భక్తులు పెద్దగా పట్టించుకోలేదు. నమాజ్ చేసేందుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు జ్ఞాన్‌వాపికి చేరుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే నేడు వేలాది మంది నమాజ్ చేసేందుకు వచ్చారు. మసీదు లోపల స్థలం లేకపోవడంతో విశ్వనాథ్ ధామ్ గేట్ నంబర్ 4 వెలుపల గుమిగూడిన భక్తులను తిరిగి పంపించి గేటును మూసివేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. భద్రత దృష్ట్యా పోలీసులు తమ బలగాలను అక్కడ మోహరించారు.
వాజుఖానా సీల్ చేశారని, దీంతో ఎక్కువ మంది మసీదుకు రావడం సరికాదని, కాబట్టి భక్తులందరూ ఆయా ప్రాంతంలోనే శుక్రవారం ప్రార్థనలు చేయాలని మసాజిద్ కమిటీ తన లేఖలో పేర్కొంది. ప్రతీ శుక్రవారం ఇక్కడ సాధారణ రోజు కంటే కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఉద్దేశంలో ఉంచుకునే ఆ కమిటీ ఇలా విజ్ఞప్తి చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాజూఖానా, మరుగుదొడ్లు సీల్ చేయడంతో నమాజ్‌కు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, దీంతో ప్రజలు ఇక్కడికి రావడం మానుకోవాలని కమిటీ కోరింది. కానీ ఈ విజ్ఞప్తి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. శుక్రవారం ప్రార్థనలకు సంబంధించి పోలీసు అడ్మినిస్ట్రేటివ్ కూడా అలెర్ట్ గానే ఉంది. ప్రార్థన మొదలైన సమయం నుంచి ముగిసే వరకు అప్రమత్తంగా పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీతో సంబంధమున్న ప్రజలు, మత పెద్దలతో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రార్థనలకు ముందు భక్తులు వుజు నిర్వహించడానికి యంత్రాంగం రెండు వాటర్ డ్రమ్ములను, మగ్గులను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మసీదు కమిటీ జాయింట్ సెక్రటరీ ఎంఎస్ యాసిన్ మాట్లాడుతూ.. మసీదు కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని అన్నారు. జ్ఞానవాపి మసీదు అని, మసీదుగానే మిగిలిపోతుందని అన్నారు. ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. దానికి సంబంధించిన నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
