త్రివిధ దళాల్లో మూడేళ్ల కాలం పాటు సైనికులను చేర్చుకునేందుకు రూపొందించిన కొత్త పథకంపై ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఈ పథకం మరి కొన్ని నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

త్రివిధ ద‌ళాల అధ్య‌క్షులు, ఇత‌ర సైనిక ఉన్న‌తాధికారులు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో శ‌నివారం స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో కొత్త ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్ స్కీమ్, దాని పనితీరు, ఇతర ముఖ్యమైన విషయాలన్నింటనీ ప్రధానికి వివరించారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మూడు డిఫెన్స్ సర్వీస్‌లలో సైనికులను చేర్చే రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను రాబోయే వారంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది.

అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి నేతృత్వంలోని సైనిక వ్యవహారాల విభాగం ఈ నియామక పథకాన్ని రూపొందించింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రక్షణ దళాలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. అయితే దీని కంటే ముందుగానే ముగ్గురు రక్షణ దళాల అధిపతులు, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అధికారులతో సహా ఉన్నత సైనిక ఉన్నతాధికారులు ప్రధానికి దీని గురించి వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయ‌ని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. 

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ అంటే ? 
త్రివిధ ద‌ళాల్లో నిపుణుల‌ను చేర్చుకునేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మే అగ్నిపథ్. ‘‘టూర్ ఆఫ్ డ్యూటీ’’ ప్రవేశ పథకానికి పెట్టిన కొత్త పేరునే ఈ విధంగా పిలుస్తున్నారు. ఈ పథకం యువకులను మూడు సంవత్సరాల పాటు సైనికులుగా భారత సాయుధ దళాలలో చేరడానికి అనుమతిస్తుంది, ఇది రక్షణ దళాల వ్యయాన్ని, ఏజ్ ప్రొఫైల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. అయితే ప్రస్తుతం సాయుధ దళాల్లో సైనికులను శాశ్వత ప్రాతిపదికన సాయుధ నియమిస్తున్నారు. 

యూపీ కెమిక‌ల్ ఫాక్ట‌రీలో పేలుడు.. 12కి చేరిన మృతుల సంఖ్య‌.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

ఈ టూర్ ఆఫ్ డ్యూటీ పథకంపై రెండేళ్ల క్రితమే చర్చలు ప్రారంభమయ్యాయి. రక్షణ దళాల్లో ప్రస్తుతం 1.25 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ కింద సైన్యంలో చేర‌డానికి దరఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు తప్పనిసరిగా 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఆయా అభ్య‌ర్థులు శారీరక సామర్థ్య పరీక్షలో అర్హత సాధించాలి. ఇండియ‌న్ ఆర్మీకి ఎంపిక చేసేందుకు అవ‌స‌రమైన విద్యార్హ‌త‌లే దీనికి కూడా వ‌ర్తిస్తాయి. అగ్నిపథ్ ప్రవేశ పథకం కింద చేరిన సైనికులను సుమారు 6 నెల‌ల పాటు శిక్ష‌ణ ఇస్తారు. అనంత‌రం వారికి మూడేళ్ల పాటు వివిధ రంగాల్లో విధులు కేటాయిస్తారు. ఆ స‌మ‌యంలో వారిని ‘అగ్నివీర్స్’ లేదా ఫైర్ వారియర్స్ అని పిలుస్తారు. 

మూడేళ్ల తరువాత ? 
ఈ అగ్నివీర్స్ మూడు సంవత్సరాల విధులు నిర్వ‌ర్తించిన త‌రువాత వారిని సివిల్ ఉద్యోగాలు చేసుకునేందుకు బ‌య‌ట‌కు పంపించే అవ‌కాశం ఉంటుంది. అయితే బెస్ట్ అగ్నివీర్స్ ను మ‌రికొంత కాలం పాటు సైన్యం త‌మ వ‌ద్దే ఉంచుకోవ‌చ్చు. కాగా బ‌య‌ట‌కు వ‌చ్చే అగ్నివీర్స్ కు రూ.10-12 లక్షల వరకు సెవరెన్స్ ప్యాకేజీని ప్ర‌భుత్వం అందించే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. డ్యూటీ నుంచి రిలీవ్ అయిన వారికి సివిల్ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా ప్ర‌భుత్వం స‌హాయం చేస్తుంది. ఈ అగ్నివీర్‌లను రిక్రూట్ చేసుకోవడానికి అనేక కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపించే అవ‌కాశం ఉంటుంది. 

‘సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 ర‌ద్దు, వ్యాక్సిన్ ఉత్పత్తి..’ 8 ఏళ్ల పాల‌న రిపోర్ట్ ను షేర్ చేసిన ప్రధాని

అన్నీ అనుకున్నట్లు జరిగితే అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ కోసం నియామక ప్రక్రియ రాబోయే మూడు, నాలుగు నెలల్లో ప్రారంభమ‌య్యే అవ‌కాశం ఉంది. కోవిడ్ -19 మ‌హమ్మారి దేశంలోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి సాయుధ ద‌ళాల్లో సైనికుల నియామ‌క ప్ర‌క్రియ నెమ్మ‌దించింది. అయితే ఈ కొత్త ప‌థ‌కం ద్వారా కొంత వేగంగా నియామ‌కాలు జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. కొంత కాలం పాటు దేశ సేవ చేయాల‌ని భావించే యువ‌త‌కు కూడా ఇది మంచి అవ‌కాశం కానుంది.