గడిచిన ఎనిమిదేళ్లలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370 రద్దు, ఇతర దేశాలతో ముఖ్యమైన ఒప్పందాలు వంటి విషయాలను ప్రధాని ప్రస్తావించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎనిమిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను చూపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘8 సంవత్సరాల నివేదిక కార్డు’ను శనివారం విడుదల చేశారు. ఇందులో పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు, మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ల ఉత్పత్తి వంటి విషయాలతో పాటు కేంద్రంలోని తన ప్రభుత్వం సాధించిన ఇతర మైలురాళ్లను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
భారత్ లో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని సర్జికల్, వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు, రక్షణ ఎగుమతుల్లో ఆరు రేట్లు పెరుగుదల, కోవిడ్-19 మహమ్మారి సమయంలో విదేశాల నుంచి 1.83 కోట్ల మంది భారతీయులను తరలించడం, 2014 నుంచి ఉగ్రవాద దాడులను 52 శాతం తగ్గించడం వంటి విషయాలను MyGovIndia అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయగా.. ప్రధాని దానిని రీట్వీట్ చేశారు.
ఈ ఎనిమిది సంవత్సరాల పాలనలో ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ అనే మంత్రంతో ప్రేరణ పొంది పేదలు, యువత, రైతులు, మహిళలు, అణగారిన వర్గాలకు తోడ్ప డుతున్న ప్రజల అనుకూల పరిపాలనను పెంపొందించడానికి తమ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రెండు వార్తా కథనాలను పంచుకున్నారు. ఇందులో స్వదేశీకరణ, రక్షణ కారిడార్ల తయారీ, రక్షణ ఎగుమతులను పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించి రక్షణ రంగంలో సంస్కరణల పరంపరను ఓ కథనం ప్రస్తావించింది.
అలాగే ఉక్రెయిన్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో యుద్ధం వాతావరణం, ఇతర సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు భారత పౌరులను రక్షించి తీసుకురావడానికి, విదేశీయులను కూడా అక్కడి నుంచి తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యకలాపాలను మరో కథనం వివరించింది. దీంతో పాటు ఆస్ట్రేలియా, యూఏఈతో ఆర్థిక ఒప్పందాలు, 100 దేశాలకు 20 కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తు వచ్చిన ఓ వార్తా భాగాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ షేర్ చేశారు.
