తాగిన మైకంలో ఓ వ్యక్తి యూపీ పోలీసులకు ఫోన్ చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో పోలీసులు అతడి లోకేషన్ ను గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానని బెదిరించిన గోరఖ్ పూర్ కు చెందిన 45 ఏళ్ల వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు యూపీ పోలీసు హెల్ప్ లైన్ నెంబర్ అయిన 112 కు కాల్ చేసి మరీ ఆ నాయకులపై హత్యా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు.
ఆదివారం రాత్రి యూపీ-112 హెల్ప్ లైన్ నంబర్ కు ఓ కాల్ వచ్చింది. అందులో ఓ వ్యక్తి తాను గోరఖ్ పూర్ లోని భుజౌలి కాలనీకి చెందిన అరుణ్ కుమార్ గా పరిచయం చేసుకున్నాడు. అతడు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. తాను ప్రధాని నరేంద్ర మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తానని అందులో హెచ్చరించాడు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
టెక్నాలజీ సాయంతో నిందితుడి లోకేషన్ ను గుర్తించారు. అతడి లోకేషన్ గోరఖ్ పూర్ జిల్లాలోని హర్ పూర్ బుధత్ లోని దేవ్రాడ్ గ్రామంలో ఉందని పసిగట్టి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అతడి పేరు అరుణ్ కుమార్ కాదని, సంజయ్ కుమార్ అని నిర్ధారించుకున్నారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని డియోరియా కొత్వాలి ఎస్ హెచ్ వో డీకే మిశ్రా తెలిపారు. కాగా.. నిందితుడు ఫోన్ చేసినప్పుడు మద్యం మత్తులో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది.. ఢిల్లీకి పొంచి ఉన్న వరద ముప్పు
ఇదిలా ఉండగా గతంలోనే ప్రధానికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లను చంపేస్తామని జూన్ లో ఓ వ్యక్తి ఢిల్లీ పోలీసులకు రెండు సార్లు కాల్ చేసి చెప్పాడు. అయితే నిందితుడిని దేశ రాజధానిలోని పశ్చిమ విహార్ లోని మదీపూర్ నివాసి సుధీర్ శర్మగా గుర్తించి, అరెస్టు చేశారు.
ఆ సమయంలో ఆ నిందితుడు కూడా మద్యం మత్తులోనే పోలీసులకు ఫోన్ చేసినట్టు తెలిసింది. జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఫోన్ చేశానని నిందితుడు అంగీకరించాడు. గతంలో హత్యానేరం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడిని జువైనల్ కరెక్షన్ హోమ్ నుంచి 2018లో విడుదల చేశారు.