సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం లాంచింగ్ విజయవంతం అయినట్టుగా ఇస్రో ప్రకటించింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతంగా వేరు చేయబడిందని ఇస్రో తెలిపింది. ఎల్ 1 పాయింట్ వద్దకు ఉపగ్రహం ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొంది.
ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో వెల్లడించింది. దీంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైందని తెలిపారు. ఆదిత్య ఎల్1 కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు చెప్పారు. ఆదిత్య ఎల్ 1 దాదాపు 125 రోజులు సుదీర్ఘంగా ప్రయాణించి.. ఎల్ 1 పాయింట్‌ను చేరుకుంటుందని.. ఆదిత్య ఎల్1కు ఆల్ ది బెస్ట్ చెప్పాలని అన్నారు. ఇక, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ఆదిత్య ఎల్-1 ప్రయోగం గురించి..
-సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి ఉపగ్రహం ఇదే.
-ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూమి నుంచి సూర్యుడి దిశలో లాగ్రేంజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
-అక్కడి చేరేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతుంది.
-ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలు ఉంటుంది.
-ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపడంతో పాటు.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయాలనిఇస్రో చూస్తుంది.
-ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తుండగా.. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా), సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయనున్నాయి. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.
