పోలీసు వాహనం బానెట్ పై యువతి ఇన్ స్టాగ్రామ్ రీల్.. వైరల్ కావడంతో.. ఏం జరిగిందంటే ?
ఓ యువతి పోలీసు వాహనం ఎక్కి రీల్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో పోలీసుల వాహనాన్ని వాడుకునేందుకు యువతికి అనుమతి ఇచ్చినందుకు ఎస్ఐను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇది పంజాబ్ లో చోటు చేసుకుంది.

ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పనికి ఓ పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ యువతి పోలీసు వాహనం బానెట్ పై కూర్చొని రీల్ చేసింది. ఆ రీల్ వైరల్ అయ్యింది. అది అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఆ యువతికి పోలీసు వాహనంతో రీల్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ కు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ జలంధర్ పోలీసు స్టేషన్ కు చెందిన వాహనాన్ని రీల్స్ చేసేందుకు ఉపయోగించుకుంది. గుర్తు తెలియని యువతి పోలీసు వాహనం బానెట్ పై కూర్చొని పాపులర్ పంజాబీ బీట్ 'ఘయింట్ జట్టి'కి డ్యాన్స్ స్టెప్పులు వేయడం కనిపిస్తోంది. ఆమె తన రీల్స్ కోసం పోలీసు అధికారిక వాహనాన్ని ఉపయోగించడమే కాకుండా.. దానిపై కూర్చొని అనుచిత, అసభ్యకరమైన హావభావాలను ప్రదర్శించింది. ఆమె రీల్ లో భాగంగా తన మధ్య వేలిని చూపిస్తూ కనిపించింది.
వీడియో చివర్లో మహిళతో పాటు పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసు వాహనంపై కూర్చొని రీల్స్ చేస్తూ అభ్యంతరకరమైన హావభావాలు ప్రదర్శించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి చేరింది.
ఆ యువతికి అలా రీల్స్ చేసుకోవడానికి పోలీసు వాహనాన్ని ఇచ్చిన జలంధర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మను జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. కాగా.. ఇదే రాష్ట్రంలో ఓ ఇన్ఫుయెన్సర్ కు ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ రావడంతో.. దానిన సెలబ్రేట్ చేస్తూ థార్ బ్యానెట్ పై కూర్చొని హోషియార్ పూర్ లోని జాతీయ రహదారిపై ప్రయాణించింది. ఇది వైరల్ కావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ప్రవర్తనపై చర్యలు తీసుకున్నారు.