ఓ భర్త యూట్యూబ్ చూసి తన భార్యకు ప్రసవం చేశాడు. మగ బిడ్డ జన్మించినా.. తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి బాలింత మరణించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
ఆ యువకుడికి సేంద్రియ వ్యవసాయం అంటే పిచ్చి. అందుకే తనకున్న పొలంలో ఆ పద్దతిలోనే వ్యవసాయం చేసేవాడు. ఆధునిక చికిత్సా విధానాన్ని, మందులంటే అతడికి ఇష్టం లేదు. అందుకే భార్య గర్భవతి అని తెలిసిన నాటి నుంచి ఆమెను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోనివ్వలేదు. సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు, ఇతర గింజలు ఆకుకూరలు తీసుకొచ్చేవాడు. వాటినే ఆహారంగా కూడా ఇచ్చేవాడు. చివరికి ప్రసవం కోసం హాస్పిటల్ కు కూడా వద్దని అన్నాడు. తనే యూట్యూబ్ లో చూసి, ఇంట్లోనే ప్రసవం చేశాడు. అయితే బిడ్డ క్షేమంగానే ఉన్నప్పటికీ.. తల్లి అపస్మారకస్థితిలోకి వెళ్లి కన్నుమూసింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్ కు పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి 2021 వివాహం అయ్యింది. మాదేశ్ కు సేంద్రియ వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. నేటి ఆధునిక వైద్య విధానం అంటే ఎందుకు దురభిప్రాయం ఏర్పడిందో తెలియదు కానీ.. ఎప్పుడూ వాటి జోలికి వెళ్లేవాడు కాదు. అందుకే తనకున్న భూమిలో సేంద్రియ పద్దతిలోనే వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ క్రమంలో లోకనాయకి కొన్ని నెలల కిందట గర్భం దాల్చింది. అయితే భార్యకు కూడా ఈ ఆధునిక వైద్య విధానాన్ని అందించకూడదు అనుకున్నాడు. మందులు లేకుండా సహజంగా డెలివరీ జరగాలని అనుకున్నాడు. అందుకే ఆమెను ఒక్క సారి కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లలేదు. లోకనాయకి గర్భవతి అని తెలుసుకొని స్థానిక ఆరోగ్య కార్యకర్తలు ఆమె పేరును గవర్నమెంట్ రికార్డుల్లో రాయాలని ప్రయత్నించినా.. దానికి మాదేశ్ ఒప్పుకోలేదు. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన మెడిసిన్, పౌష్టికాహారాన్ని వద్దని చెప్పాడు. పలు రకాల గింజలు,న ఆకుకూరలు తెచ్చి ఇచ్చేవాడు.
కాగా.. ఈ నెల 22న లోకనాయకికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో తన ఫోన్ లో యూట్యూబ్ తెరిచి, సహజం ప్రసవం చేసే విధానాన్ని తెలుసుకున్నాడు. అలాగే ప్రసవం కూడా చేశాడు. మగ శిశువు జన్మించాడు. అయితే ఆమెకు సరిగా వైద్యం అందకపోవడంతో.. ప్రసవం జరిగిన వెంటనే ఆమె తీవ్ర అస్వస్థతకు లోనయ్యింది. దీంతో మాదేశ్ తన భార్యను కున్నియార్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. కానీ పరిస్థితి విషమించి మధ్యలోనే బాలింత మరణించింది. ఈ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.
