గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమం..
మాఫియా డాన్, మాజీ ఎమ్మెల్మే ముక్తార్ అన్సారీ ఆరోగ్యం విషమించింది. దీంతో రాత్రికి రాత్రే జైలు అధికారులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అన్సారీ ఐసీయూలో ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే, జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని బందాలోని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీలోని ఐసీయూలో ఆయనను చేర్పించారు. దీంతో మెడికల్ కాలేజీ ఐసీయూ జోన్ ను పోలీసు యంత్రాంగం పూర్తిగా కంటోన్మెంట్ గా మార్చింది.
ముక్తార్ అన్సారీ మూడు రోజులుగా యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు సమాచారం. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో ఆయనను శస్త్రచికిత్స కోసం ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
కాగా.. రెండు రోజుల క్రితం ముక్తార్ అన్సారీ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం కారణంగా ఒక జైలర్, ఇద్దరు డిప్యూటీ జైలర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాఫియా ముక్తార్ అన్సారీ కోర్టుతో వర్చువల్ గా మాట్లాడుతూ.. జైలు యంత్రాంగం తనకు స్లో పాయిజన్ ఇచ్చిందని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నట్టు తెలుస్తోంది.
అయితే గత వారం రోజులుగా ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. సోమవారం సమయంలో పరిస్థితి మరింత విషమించిందని, అందుకే రహస్యంగా మెడికల్ కాలేజీలో చేర్పించారని ‘ఇండియా టీవీ’ పేర్కొంది. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులకు చేరవేశారు. నేటి మధ్యాహ్నం వరకు వారు హాస్పిటల్ కు చేరుకుంటారని సమాచారం.