హీరో విశాల్ ‘లంచం’ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం.. సెన్సార్ బోర్డుపై సీరియస్.. నేడే విచారణ..
మహారాష్ట్రలోని సెన్సార్ బోర్డు ఆఫీసుకు లంచం ఇచ్చానని హీరో విశాల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ రోజే ఈ విషయంలో విచారణ జరిపేందుకు అధికారిని ముంబాయికి పంపించినట్టు వెల్లడించింది. అవినీతిని ప్రభుత్వం సహించబోదని పేర్కొంది.

తమిళ నటుడు, నిర్మాత విశాల్ ముంబాయిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ)పై గురవారం సంచలన ఆరోపణలు చేశారు. 'మార్క్ ఆంటోనీ' హిందీ సెన్సార్ హక్కుల కోసం సీబీఎఫ్ సీ ముంబై కార్యాలయం రూ.6.5 లక్షలు లంచం డిమాండ్ చేసిందని ఆయన నిన్న సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సెన్సార్ బోర్డుపై వచ్చిన ఆరోపణలపై నేడే విచారణ జరపనున్నట్టు వెల్లడించింది.
హీరో విశాల్ చేసిన అవినీతి ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్)లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘నటుడు విశాల్ కు సీబీఎఫ్ సీలో ఎదురైన అవినీతి అనుభవం చాలా దురదృష్టకరం. అవినీతిని సహించేది లేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామం. ఈ రోజే విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారిని ముంబైకి పంపించాం’’ అని ప్రకటన పేర్కొంది.
అలాగే సీబీఎఫ్ సీ జరిగే వేధింపులకు సంబంధించిన ఇతర ఘటనలపై సమాచారాన్ని అందిచాలని సమాచార, ప్రసార మంత్రిత్వ కోరింది. ప్రతీ ఒక్కరూ మంత్రిత్వ శాఖకు అభ్యర్థిస్తున్నామని పేర్కొంది. ఈ పోస్టుకు హీరో విశాల్ , ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మోషన్ పిక్చర్స్ అసోషియేషన్ ల ఎక్స్ హ్యాండిల్స్ ను మెన్షన్ చేసింది.
హీరో విశాల్ తన ఎక్స్ హ్యాండిల్ లో గురువారం వీడియో విడుదల చేస్తూ.. తాను మార్క్ ఆంటోనీ సినిమా హిందీ హక్కుల కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘సినిమాల్లో అవినీతిని చూపించడం వరకు బాగానే ఉంది. కానీ రియల్ లైఫ్‌లో దీన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే ముంబయిలోని సీబీఎఫ్‌సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆఫీసుల్లో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా `మార్క్ ఆంటోనీ` హిందీ వెర్షన్ సెన్సార్ కోసం 6.5లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నేను రెండు లావాదేవీలు చేశాను. ఒకటి స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు. రెండు సర్టిఫికేట్ కోసం మరో మూడున్నర లక్షలు చెల్లించాను. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఫేస్ చేయలేదు.’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఈ విషయాన్ని మహారాష్ట సీఎం ఏక్ నాథ్‌షిండే, ప్రధాని మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఇప్పుడు ఇలా చేయడం కేవలం నాకోసం కాదు. భవిష్యత్‌లో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా. నిజం ఎప్పటికీ గెలుస్తుందని ఆశిస్తున్నా, గుడ్ బాయ్’’ అని తెలిపారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.