ప్రజల మధ్య మత విద్వేశాలు పెరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచే ఇలాంటి పరిస్థితి ఎక్కువవుతోందని అన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలు కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 

ప‌లు వ‌ర్గాల మ‌ధ్య అంత‌రం పెరుగుతోంద‌ని, ఇది 2014 సంవ‌త్స‌రం నుంచే మొద‌లైంద‌ని ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఆరోపించారు. శ‌నివారం పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన ఎన్‌సీపీ ర్యాలీని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. ద్రవ్యోల్బణం, కేంద్ర సంస్థల దుర్వినియోగం, మతతత్వం వంటి అనేక అంశాల‌పై ఆయ‌న బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ఆ పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీని రక్షించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విఫలమైందని ఆరోపించారు. ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసను ప్రస్తావిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. “ కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మత హింస కారణంగా ఉడికిపోయింది. ఢిల్లీ రాష్ట్రాన్ని (ముఖ్యమంత్రి) అరవింద్ కేజ్రీవాల్ నియంత్రిస్తారు. అయితే అక్కడి పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కిందకు వస్తారు, దీనిని అమిత్ షా చూసుకుంటారు. మత హింస నుండి నగరాన్ని రక్షించడంలో షా విఫలమయ్యాడు.’’ అని అన్నారు. 

‘‘ ఢిల్లీలో ఏదైనా జరిగితే ఆ సందేశం యావత్ ప్రపంచానికి వెళ్తుంది. ఢిల్లీలో అశాంతి నెలకొందని ప్రపంచం ఊహిస్తోంది. మీరు అధికారంలో ఉన్నారు కానీ మీరు ఢిల్లీని సరిగా నిర్వహించలేకపోయారు.’’ అని శరద్ పవాార్ అన్నారు. అనంతరం హుగ్లీ అల్లర్లపై కూడా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘ హుబ్బాలిలో గత వారం ఘర్షణలు జ‌రిగాయి. అక్క‌డి హోర్డింగ్‌లపై మైనారిటీ వర్గాలకు చెందిన దుకాణాలు, వాటి యజమానుల పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అలాంటి షాపుల నుంచి కొనుగోలు చేయొద్దని కూడా అందులో రాశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రం సర్వసాధారణం. ’’ అని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. 

దేశంలో ఇటీవల జరిగిన జ‌రిగిన ఉప ఎన్నికలకు ముందు బీజేపీకి వైపు ఓట‌ర్లను ప్ర‌భావితం చేసేందుకు, మ‌త విద్వేశాల‌ను రెచ్చగొట్టేందుకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను ప్రతీ చోటా ప్రదర్శించారని శ‌ర‌ద్ ప‌వార అన్నారు. 1990వ దశకం ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం పెరిగినప్పుడు (ఇది కాశ్మీరీ పండిట్‌ల బలవంతపు బహిష్కరణకు దారితీసింది) వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆయ‌న ప్ర‌భుత్వానికి బీజేపీ మ‌ద్ద‌తు ఉంద‌ని చెప్పారు. అయితే ఈ వాస్త‌వాన్ని దాచేశార‌ని ఆయ‌న ఆరోపించారు. 

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని ప్రతిపక్షాలు వినయంగా, ప్ర‌జ‌ల ఆదేశం అని అంగీక‌రించాయ‌ని ప‌వార్ చెప్పారు. అయితే ఈ దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న మతతత్వ శక్తులను నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ‘‘ మ‌నం కడు పేదరికంలో ఉన్న యువత సమస్యలను పరిష్కరించాలి. రెండంకెల ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల భారాన్ని తగ్గించాలి ’’ అని అన్నారు. 

Scroll to load tweet…

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, నరసింహారావు, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్ ప్రధాన మంత్రులుగా ఉన్న స‌మ‌యంలో ఇతర దేశాల నేతలు భారత్‌లో పర్యటించినప్పుడు ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతాకు వెళ్లేవారని శ‌ర‌ద్ ప‌వార్ గుర్తు చేశారు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింద‌ని అన్నారు. ఇత‌ర దేశ నాయ‌కులు భారతదేశానికి వచ్చినప్పటికీ, గుజరాత్‌లో మాత్రమే సందర్శిస్తార‌ని విమ‌ర్శించారు. ఢిల్లీ పాల‌కులు ఇతర రాష్ట్రాల గురించి ఏమనుకుంటున్నారో ఈ విష‌యం తెలియ‌జేస్తుంద‌ని అన్నారు. 

ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి తాము పెద్ద పోరాటం చేస్తున్నామ‌ని శ‌ర‌ద్ ప‌వార్ అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత వర్గాలు, ప్రజల మధ్య అంతరం పెరిగింద‌ని ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురించి ఇంతకు ముందు చాలా తక్కువ మందికి తెలుసునని, అయితే ఇప్పుడు ED ప్రతిచోటా ఉందని అన్నారు. ఎన్‌సీపీకి చెందిన నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌లను తప్పుడు కేసుల్లో ఇరికించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఈడీ, సీబీఐ ఇత‌ర ఏజెన్సీల ద్వారా ఒత్తిడిని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.