Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కొత్త బాస్ ఎన్నిక అప్పుడే.. సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న‌ 28న సీడ‌బ్ల్యూసీ సమావేశం

కాంగ్రెస్: ఆగస్టు 28న  సీడ‌బ్ల్యూసీ సమావేశం తర్వాత కొత్త కాంగ్రెస్ చీఫ్‌ని ఎన్నుకునేందుకు కచ్చితమైన ఎన్నికల తేదీలను కాంగ్రెస్ ప్రకటించనుంది. 28న‌ మధ్యాహ్నం 3:30 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
 

The election of the new Congress chief CWC meeting to be chaired by Sonia Gandhi on August 28
Author
Hyderabad, First Published Aug 24, 2022, 2:12 PM IST

న్యూఢిల్లీ:  పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ‘ఖచ్చితమైన తేదీల షెడ్యూల్‌’ను ఆమోదించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆగస్టు 28న వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆగస్టు 28న మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు. ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాల నుండి వర్చువల్‌గా సమావేశానికి హాజరవుతారు. ఆమె వెంట కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.

"కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక తేదీల ఖచ్చితమైన షెడ్యూల్‌ను ఆమోదించడానికి 28 ఆగస్టు, 2022న మధ్యాహ్నం 3:30 గంటలకు CWC  వర్చువల్ సమావేశం జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ CWC సమావేశానికి అధ్యక్షత వహిస్తారు" అని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ట్విట్టర్‌లో తెలిపారు.

కాగా, అనేక సందర్భాలలో  ప‌లువురు నాయకులు రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ గాంధీ ఇప్ప‌టివ‌ర‌కు ఏ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై అనిశ్చితి.. ఉత్కంఠ కొనసాగుతోంది. 2019లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో ఓటమిని చవిచూసిన తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత, తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కూడా 2020 ఆగస్టులో బహిరంగ సభ తర్వాత నిష్క్రమించడానికి ప్రతిపాదించారు. G-23గా సూచించబడిన ఒక వర్గం నాయకుల తిరుగుబాటుతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ CWC ఆమెను అధ్య‌క్షులుగా కొనసాగించమని కోరింది.

కాగా, రాహుల్ గాంధీకి ఇష్టం లేకున్నా.. ఆయనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావాలని ఫోర్స్ చేయలేమని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో కొందరు విలేకరులు దిగ్విజయ్ సింగ్‌ను పార్టీ అధ్యక్ష పోస్టు గురించి ప్రశ్నలు వేశారు. రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆయనకు మీరు అప్పీల్ చేస్తారా? అని ఓ ప్రశ్న వచ్చింది. దీనికి ఆయన సమాధానం కొంచెం కొత్తగా ఉన్నది. బహుశా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం గాంధీయేతరుల వైపు చూస్తున్నదని చెప్పడానికి సంకేతంగానూ ఉన్నది. ఆ ప్రశ్నకు సమాధానంగా.. ఆ అప్పీల్ అందరికీ తెలిసిందే. కానీ, నిర్ణయం రాహుల్ గాంధీనే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, ఎవరినైనా సరే పర్టికులర్ నిర్ణయం తీసుకోవాలని ఎలా ఫోర్స్ చేయగలం? అని అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios