ఢిల్లీలో రైతుల ఆందోళన ఉద్ధృతమైంది. వారికి మద్ధతుగా భారీగా తరలివస్తున్నారు రైతులు. రాజస్థాన్, హర్యానా బోర్డర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీకి వెళ్లేందుకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు రైతులు.

టోల్‌గేట్లు, బారికేడ్లు ధ్వంసం చేశారు. అయితే వీరిని షాజహాన్ పూర్ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రైతులు ప్రతిపాదించిన నాలుగు డిమాండ్లలో రెండింటికి కేంద్రం అంగీకరించింది.

Also Read:రైతుల ఆందోళన: ముగిసిన ఆరో విడత చర్చలు.. కాస్త బెటర్ రిజల్ట్

విద్యుత్ చట్టం, వ్యవసాయ వ్యర్ధాలను తగులబెడితే జరిమానాలు ఈ రెండు అంశాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. కనీస మద్ధతు ధరపై చర్చించేందుకు కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.

అందుకు రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. చట్ట బద్ధత కల్పించేందుకు కమిటీ అవసరం లేదని, అందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు రావాలని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.

వ్రాత పూర్వక హామీలతో ఉపయోగం లేదని తేల్చి చెప్పాయి. మొత్తానికి వ్యవసాయ చట్టాల రద్ధు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే రెండు కీలక డిమాండ్లు మాత్రం పెండింగ్‌లో వున్నాయి. వీటికి మరో దఫా జనవరి 4న చర్చలు జరపనున్నారు.