Narendra Modi...బీజేపీ సుపరిపాలనకు ఓటు: ఎన్నికల ఫలితాలపై మోడీ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడ బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధీమాను వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ:విపక్షాలు నెగిటివ్ గా ఆలోచించడం మానుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు.సోమవారంనాడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారంనాడు పార్లమెంట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. నెగిటివిటీని దేశ ప్రజలు తిరస్కరించారని ఆయన అభిప్రాయపడ్డారు.నిన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
బీజేపీ సుపరిపాలనకు ప్రజలు ఓటేశారని మోడీ చెప్పారు. కొత్త పార్లమెంట్ లో నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.మూడు రాష్ట్రాలో విజయం బీజేపీకి కొత్త ఉత్సహన్ని ఇచ్చిందన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కూడ తాము మరోసారి సత్తా చాటుతామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో పేదలకు అందించినవారికే ప్రజలు పట్టం కట్టారని మోడీ అభిప్రాయపడ్డారు.సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారన్నారు.పార్లమెంట్ సమావేశాలకు అన్ని అంశాలపై సిద్దమై రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంపీలకు సూచించారు. కోపానికి, చిరాకుకు పార్లమెంట్ ను వేదికగా ఉపయోగించుకోవద్దని మోడీ కోరారు.
ఇవాళ్టి నుండి ఈ నెల 22వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.