బీజేపీ గెలవాలి.. కానీ మోడీ మళ్లీ ప్రధాని కావొద్దు - సుబ్రమణ్యస్వామి
కేంద్రంలో మూడో సారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని, కానీ మరో సారి మోడీ ప్రధాని కాకూడదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి అన్నారు. మోడీ 4065 చదరపు కిలోమీటర్ల లడఖ్ భూభాగాన్ని కబ్జా చేసిన చైనీయులకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి తీవ్ర విమర్శలు చేశారు. 4065 చదరపు కిలోమీటర్ల లడఖ్ భూభాగాన్ని కబ్జా చేసిన చైనీయులకు క్లీన్ చిట్ ఇస్తూ 'కోయి ఆయా నహీ..' అంటూ మోడీ భరతమాతకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
‘‘ఇప్పటికే 4065 చదరపు కిలోమీటర్ల లడఖ్ భూభాగాన్ని కబ్జా చేసిన చైనీయులకు క్లీన్ చిట్ ఇస్తూ 'కోయి ఆయా నహీ..' అంటూ మోడీ భరతమాతకు ద్రోహం చేశారు. 2024లో బీజేపీ గెలవాలి కానీ మోదీ మళ్లీ ప్రధాని కాకూడదు’’ అని పేర్కొన్నారు.
బుధవారం ఉదయం చేసిన మరో ట్వీట్ లో కూడా సుబ్రమణ్య స్వామి ప్రధానిపై విరుచుకుపడ్డారు. ‘‘మోడీని మూడోసారి ప్రధాని అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టినట్లయితే దేశమంతా బహిరంగంగా వ్యతిరేకించాలి. 4065 చదరపు కిలోమీటర్ల వివాదరహిత భారత భూభాగాన్ని చైనాకు స్వేచ్ఛగా మింగడానికి అనుమతించడం ద్వారా భరతమాతను అణగదొక్కారు. మనకు తెలియకుండానే "కోయి ఆయా నహీ.." అని అబద్ధం చెప్పారు.’’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది. ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారు. మొదటి సారిగా 2014 నుంచి ఆయన లోక్ సభకు అక్కడి నుంచే ఎంపికయ్యారు. రెండో సారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ముచ్చటగా మూడో సారి అదే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.