ఆ పొగ హానికరమైనది కాదు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
Parliament Security Breach : లోక్ సభలో భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి గ్యాస్ డబ్బాలను తీసుకొని గందరగోళం సృష్టించారు. అయితే గ్యాస్ డబ్బాల నుంచి వెలువడిన పొగ ప్రమాదకరమైనది కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.
Parliament Security Breach : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్ సభలో జీరో అవర్ కొనసాగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. వారి వద్ద ఉన్న స్మోక్ డబ్బాలను తెరిచి సభలో అటూ, ఇటూ పరిగెత్తారు. దీంతో సభా ప్రాంగణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు.
భద్రతా ఉల్లంఘనపై లోక్ సభ తన వంతుగా పూర్తి దర్యాప్తు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. డబ్బాల నుంచి వెలువడిన పొగ హానిచేయనిదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బిర్లా తెలిపారు. దీనిపై తుది దర్యాప్తు ఫలితాలను సభకు తెలియజేస్తానని చెప్పారు.
ఈ ఘటనలో బాధ్యులుగా ఉన్న ఇద్దరు చొరబాటుదారులను అరెస్టు చేశామని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. వారి వద్ద ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, బయట ఉన్న ఇద్దరిని కూడా పట్టుకున్నామని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ.. 2001 డిసెంబర్ 13న పాత పార్లమెంటుపై దాడి జరిగిందని చెప్పారు. ‘‘నేడు వార్షికోత్సవం... మేమందరం ఉదయాన్నే సమావేశమై అమరవీరులకు నివాళులు అర్పించాము. ఈ రోజు అనుకోకుండా పార్లమెంటుపై మరో దాడి జరిగింది. రెండు దాడులు భిన్నమైనవని నేను అంగీకరిస్తున్నాను. అయితే ఎలా అన్నదే ప్రశ్న.’’ అని అన్నారు.
అలాగే టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ‘‘ఎంట్రీ గేటు వద్ద ఎంపీలు లోపలికి వెళ్ల ప్రదేశంలో జనం గుమిగూడి ఉంటున్నారు. వారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉంటూ ఫొటోలు తీసుకుంటున్నారు. అందులో ఎవరు ఎంపీ, ఎవరు కాదో ఎవరూ ఊహించలేకపోతున్నారు’’ అని తెలిపారు.
సభలోని ఎంపీల ఆందోళనలను గమనించిన బిర్లా.. ‘‘మీ ఆందోళనలన్నింటినీ నేను అర్థం చేసుకున్నాను. కాసేపట్లో అందరం కలిసి కూర్చుని చర్చిస్తాం. సభలో మెరుగైన ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై మీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం... సందర్శకుల పాస్ లు చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చిస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నా సభను నడపాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని అన్నారు.