న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెసు నేత శశి థరూర్ పై ప్రాసిక్యూషన్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రాసిక్యూషన్ శనివారం ఢిల్లీ కోర్టుకు సమర్పంచిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. 

పాకిస్తానీ లేడీ జర్నలిస్టు మెహర్ తారార్ తో శశి థరూర్ దుబాయ్ లో మూడు రాత్రులు గడిపాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని సునంద పుష్కర్ స్నేహితురాలు, సీనియర్ జర్నలిస్టు నళినీ సింగ్ చెప్పినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. 

నళినీ సింగ్ వాంగ్మూలాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ న్యాయమూర్తి అజయ్ కుమార్ కు చదివి వినిపించారు. "సునంద నాకు మూడు నాలుగేళ్లుగా తెలుసు. గత సంవత్సరం నుంచే ఆమె తన వ్యక్తిగత విషయాలు నాకు చెప్పడం ప్రారంభించింది. దుబాయ్ లో మెహర్ తో తన భర్త మూడు రాత్రులు గడిపినట్లు నాకు సునంద చెప్పింది" అని నళినీ సింగ్ అన్నారు.

థరూర్, మెహర్ మధ్య శృంగార సందేశాలు నడిచినట్లు సునంద చెప్పుకుని ఏడ్చిందని నళినీ సింగ్ తెలిపారు. భార్య కారణమైన థరూర్ ను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు.