గుజరాత్ లో అమ్మాయిల మీద విచిత్రమైన నిబంధనలు విధిస్తున్నారు. పెళ్లి కాని అమ్మాయిలు ఫోన్లు వాడొద్దంటూ ఠాకూర్ సమాజ్ సభ్యులు తీసుకున్ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

గుజరాత్ : ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా.. ఎక్కడ ఏది జరిగినా.. సమాజంలో ఎలాంటి పోకడలు జరిగిన.. బాధితులు మహిళలై అయినా కూడా.. అమ్మాయిలనే టార్గెట్ చేస్తారు. వస్త్రధారణ, స్వేచ్ఛ, ప్రవర్తన అంటూ నిబంధనలు విధించడానికి ముందుంటారు. అంతేకానీ, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నించరు. అలాంటి ఓ ఘటనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కాని యువతులు ఫోన్లు వాడొద్దంటూ ఓ సమాజ్ కి చెందిన సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

గుజరాత్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. పెళ్లి కాని అమ్మాయిలు ఫోన్లు వాడొద్దని ఓ తలతిక్క నిబంధన పెట్టారు గుజరాత్ లోని ఠాకూర్ సమాజ్ కు చెందిన సభ్యులు. పెళ్ళికాని అమ్మాయిలకి ఫోన్లు వాడడానికి అనుమతించవద్దంటూ నిబంధన విధించారు. ఈ నిబంధనతో పాటు 11 సంస్కరణలు కూడా ఠాకూర్ సమాజ్ సభ్యులు రూపొందించారు. గుజరాత్ లోని బనాస్ కాంఠా జిల్లాలోని బాభర్ తాలూకా లున్ సేలా గ్రామంలో సంత్ శ్రీ సదారాం బాపు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. 

ఈ మహోత్సవంలోనే మొత్తం 11 సంస్కరణలతో పాటు ఈ నిబంధనను పెట్టారు. అంతేకాదు తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తాముపెట్టిన ఈ నిబంధనలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని.. అలా ఉండేలా చర్యలు తీసుకుంటామని శపథాలు కూడా చేశారు. ఈ సంస్కరణల్లో కొన్ని…

- వివాహ వేడుకల సమయంలో డీజేలపై నిషేధం విధించడం
- పెళ్లిలలో కానుకలుగా వస్తువులు లాంటి వాటికి బదులు నగదు ఇవ్వడం
- ఇక వివాహ వేడుకల సమయంలో నిశ్చితార్థానికి 11 మంది, పెళ్లికి 51 మంది మాత్రమే అతిథులు హాజరు కావాలి.. ఇంతకు మించొద్దు
- బాలికలు చదువుకోవడానికి వెళుతున్న సమయంలో ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలి..

పెళ్లి చేసుకోవాలని, పిల్లలకు తండ్రిగా ఉండాలని ఉంది. కానీ,.. : రాహుల్ గాంధీ

వీటితో పాటు మరికొన్ని సంస్కరణలు ఉన్నాయి. గుజరాత్ లోని వావ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిబెన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈ సంస్కరణలను రూపొందించినట్లు తెలుస్తోంది. వివాహాల పేరుతో ఖర్చులను పెంచుకోవడం.. డబ్బును వృధా చేయకుండా అరికట్టడానికి తీసుకున్న ఈ సంస్కరణలన్ని బాగున్నాయి. అమ్మాయిల విద్య, వారి రక్షణ విషయంలో తీసుకున్న సంస్కరణ విషయంలోనూ గొడవ లేదు. కానీ, అమ్మాయిలు పెళ్లయ్యే వరకు ఫోన్లు వాడొద్దనే విషయానికి వచ్చేసరికి వివాదాస్పదంగా మారింది. 

ఇదిలా ఉండగా, గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో ఇలా అమ్మాయిల ఫోన్ల వాడకం మీద నిబంధనలు విధించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 2019లో గుజరాత్‌లోని బనస్కాంతలోని జలోల్ గ్రామంలో జరిగిన సంఘం సమావేశంలో, కొన్ని "కీలకమైన" నిర్ణయాలు తీసుకున్నారు. పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం పెళ్లికాని అమ్మాయి మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం నేరంగా పరిగణించబడుతుంది. అంతే కాదు, ఏ అమ్మాయి అయినా తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం కూడా నేరం అవుతుంది. 

ఒకవేళ ఇలా జరిగితే... అమ్మాయి తండ్రి రూ. 1.5 లక్షల వరకు చెల్లించాలి. తదుపరి సంఘం సమావేశంలో ఈ చర్యలపై తుది నిర్ణయాలు తీసుకోబడతాయి. అయితే ఈ ప్రతిపాదనలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 “పెళ్లి ఖర్చులు తగ్గించుకోవడానికి కొన్ని రూల్స్ బాగున్నాయి.. కానీ టీనేజ్ అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకూడదనే రూల్ లో ఓ సమస్య ఉంది.. అబ్బాయిల విషయంలోనూ ఓ రూల్ పెడితే బాగుంటుంది.. ఇక ప్రేమ వివాహాల మీద ఏమీ చెప్పలేను. నా వివాహం కూడా ప్రేమ వివాహమే’ అన్నారు.