కేంద్రమంత్రి పియుశ్ గోయల్‌కు ఎలన్ మస్క్ క్షమాపణలు.. ఎందుకంటే?
కేంద్రమంత్రి పియుశ్ గోయల్ కాలిఫోర్నియాలోని టెస్లా ప్లాంట్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ హాజరుకావాల్సింది. కానీ, అనారోగ్య కారణాల వల్ల ఆయన కాలిఫోర్నియాకు రాలేకపోయారు. కేంద్రమంత్రి పియుశ్‌ను కలువలేకపోయారు. దీనికి క్షమాపణలు కూడా చెప్పారు.
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఈ రోజు కేంద్ర కామర్స్ మంత్రి పియుశ్ గోయల్‌కు క్షమాపణలు చెప్పారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమంట్‌లో టెస్లా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని పియుశ్ గోయల్ సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి పియుశ్ గోయల్ ఈ రోజు అమెరికా కాలిఫోర్నియాలోని టెస్లా ప్లాంట్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పియుశ్ గోయల్‌ను కలవాల్సి ఉన్నది. కానీ, ఎలన్ మస్క్ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో కాలిఫోర్నియాకు ప్రయాణించే పరిస్థితి లేకుండింది. కేంద్రమంత్రి పియుశ్ గోయల్‌ను ఎలన్ మస్క్ కలువలేకపోయారు.
టెస్లా ప్లాంట్‌ను సందర్శించిన కేంద్రమంత్రి పియుశ్ గోయల్ ఆ ప్లాట్‌లో పని చేస్తున్న భారత నిపుణులు, ఇంజినీర్లను కలుసుకున్నారు. వారితో మాట్లాడారు. అనంతరం, ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘కాలిఫోర్నియా ఫ్రెమంట్‌లోని టెస్లా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సందర్శించాను. టెస్లా అద్భుత ప్రయాణంలో పాలుపంచుకుంటున్న, సీనియర్ పొజిషన్‌లలో ఉన్న భారత ఇంజినీర్లు, ఫైనాన్స్ ప్రొఫెషన్స్‌ను చూడటం సంతోషంగా ఉన్నది’ అని వివరించారు. అలాగే, టెస్లా ఈవీ సప్లై చైన్‌లో భారత కంపొనెంట్ల దిగుమతులకు ప్రాధాన్యత పెరగడం ఆనందదాయకంగా ఉన్నదని తెలిపారు. భారత్ నుంచి దిగుమతులను రెట్టింపు చేసుకునే ప్రయాణంలో టెస్లా కంపెనీ ఉన్నదని వివరించారు.
Also Read: బీజేపీ బలవంతంతోనే జనసేన పొత్తు? పవన్ ఎందుకు ప్రచారం చేయడం లేదు?
‘ఈ పర్యటనలో ఎలన్ మస్క్ లోటు ఉన్నది. ఆయన అనారోగ్యం నుంచి వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పియుశ్ గోయల్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు ఎలన్ మస్క్ స్పందించారు. టెస్లా ప్లాంట్‌ను మీరు సందర్శించడం మాకు గర్వకారణం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు నా క్షమాపణలు. కానీ, భవిష్యత్ తేదీల్లో మిమ్మల్ని కలువాలని అనుకుంటున్నాను’ అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.