ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఎవ్వరిని ముష్కరులు వదలరా..? కిడ్నాప్ చేసి క్రూరంగా

terrorists revenge on indian army
Highlights

కచ్‌దూరా, సోఫియాన్ జిల్లాల్లో గత ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు.. గత నెలలో రైఫిల్ మ్యాన్‌ ఔరంగజేబును దారుణంగా హతమార్చగా.. తాజాగా నిన్న జావేద్ అనే కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసిన ముష్కరులు ఆయనను అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

ఉగ్రవాదులను ఏరివేయాలని కంకణం కట్టుకున్నారు భద్రతా సిబ్బంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూలోని ద్రాడడ్ , కచ్‌దూరా ప్రాంతాల్లో ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. రెండు ఎన్‌కౌంటర్లలో హిజుబుల్ ముజుహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరడుగట్టిన ఉగ్రవాది సమీర్ టైగర్ కూడా ఉన్నాడు. ఈ ఎదురుదెబ్బను తట్టుకోలేని ముష్కరులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు.

అదనుచూసి దెబ్బకు దెబ్బ తీయాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో రంజాన్ పండుగ వేళ.. సొంత ఇంటికి వెళుతున్న రైఫిల్ మ్యాన్ ఔరంగజేబును కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. ఆయన శరీరం మొత్తాన్ని బుల్లెట్లతో జల్లెడగా మార్చారు.  తాజాగా కచ్‌దూరా ప్రాంతంలో జావేద్ అహ్మద్ అనే కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు  నిన్న అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు.

ఈ క్రమంలో ఇవాళ కుల్గాం జిల్లాలోని సెహ్‌పొరా  ప్రాంతంలోని రోడ్డు పక్కన జావేద్ మృతదేహాన్నికనుగొన్నారు.. అతని శరీరం మొత్తాన్ని బుల్లెట్లతో ఛిద్రం చేశారు.. తల గుర్తుపట్టులేనంతగా మాంసం ముద్దగా మారిపోయింది. చంపేముందు అతన్ని హింసించచిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

నాడు కచ్‌దూరాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీస్ బృందంలో జావేద్ కూడా సభ్యుడే.. దీనిని బట్టి ఆ ఎన్‌కౌంటర్లలో తమ వారి ప్రాణాలు తీసిన భద్రతా సిబ్బందిని క్రూరంగా చంపడమే ఉగ్రవాదుల లక్ష్యంగా తెలుస్తుందంటున్నారు నిపుణులు. 

loader