పశ్చిమ బెంగాల్ లో రామనవమి ఊరేగింపు సందర్భంగా మరోసారి హింసాత్మక ఘటన తెరపైకి వచ్చింది. హూగ్లీలో రామనవమి రోజు ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో సెక్షన్ 144 విధించారు.
పశ్చిమ బెంగాల్ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుగ్లీ జిల్లాలో ఆదివారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న నేపథ్యంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీంతో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
కదులుతున్న రైలులో పెట్రోల్ దాడి.. చిన్నారితో సహా ముగ్గురు మరణం..ఇద్దరి పరిస్థితి విషమం..
శ్రీరామనవమి సందర్భంగా హుగ్లీలోని రిష్రాలో హిందూ సంస్థలు ఊరేగింపు నిర్వహించాయి. ఇందులో బీజేపీ జాతీయ నాయకుడు దిలీప్ ఘోష్ పాల్గొన్నారు. అయితే ఆయన వెళ్లిపోయిన తరువాత అకస్మాత్తుగా రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. హింసాకాండ సందర్భంగా దుండగులు దహన ఘటనకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో ఆ ర్యాలీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే బిమన్ ఘోష్ కు కూడా గాయాలు అయ్యాయి.
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ర్యాలీని బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు నిర్వహించాయని చందన్‌నగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అమిత్ జబల్‌గిర్ తెలిపారు. ఈ అల్లర్లపై సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసు బలగాలను ఘటనా స్థలానికి పంపించామని తెలిపారు.
గడ్డి కోసుకురావడానికి వెడితే కరెంట్ షాక్.. 12యేళ్ల బాలిక మృతి, మరో చిన్నారి పరిస్థితి విషమం..
ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. శోభా యాత్ర రిశ్రాలోని సంధ్యా బజార్ ప్రాంతం దాటుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఇక్కడ మైనారిటీ వర్గాల ఆధిపత్యం ఉంటుందని సమాచారం. అయితే ఈ హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో రిష్రా వార్డు 1-5, శ్రీరాంపూర్ 24 వార్డుల్లో సీఆర్పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. రిష్రా, శ్రీరాంపూర్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హింసాకాండకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని గవర్నర్ సీవీ ఆనంద బోస్ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారు, వారిని ప్రేరేపించేవారు త్వరలోనే తాము నిప్పుతో చెలగాటం ఆడుతున్నామని గ్రహిస్తారని ఆయన అన్నారు. దుండగులను, రౌడీలను, దుండగులను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు.
'అస్సాంలో ఆప్ అధికారంలోకి వస్తే.. ': హామీల జల్లు కురిపించిన సీఎం కేజ్రీవాల్
కాగా.. గురు, శుక్రవారాల్లో కూడా ఈ ప్రాంతానికి పొరుగున ఉన్న హౌరా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా హింస చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 45 మందిని అరెస్టు చేసి, నిషేధాజ్ఞలు విధించడంతో పాటు ఇంటర్నెట్ ను నిలిపివేశారు.
