పొలంలో గడ్డి కోసుకురాడానికి వెళ్లిన అక్కాచెల్లెళ్లిద్దరు కరెంట్ షాక్ కు గురయ్యారు. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ లో హైటెన్షన్ వైర్ తగిలి మైనర్ బాలిక విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మరో బాలిక అయిన ఆమె చెల్లెలు తీవ్ర గాయాలపాలైన సంఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. చార్తావాల్‌లోని కసియారా గ్రామంలో సోదరీమణులు పొలంలో గడ్డి సేకరించడానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు.
అనుష్క (12), అవ్ని (10) ప్రమాదవశాత్తు తెగిపోయిన హైటెన్షన్ వైరును తాకినట్లు చార్తావాల్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్ సింగ్ తెలిపారు. కరెంట్ షాక్ తో అనుష్క అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె సోదరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ లో ఘోరం.. తొమ్మిదేళ్ల బాలిక హత్య, ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ కవర్లో కుక్కి...
దీంతో ఆగ్రహించిన స్థానికులు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అధికార యంత్రాంగంపై నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సహాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఇస్తుందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పర్మానంద్ ఝా తెలిపారు. గాయపడిన బాలిక చికిత్సకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జూన్ లో తెలంగాణలోని వరంగల్ లో వెలుగు చూసింది. స్కూల్ టైం అయిపోయిన తరువాత పిల్లలంతా దాగుడుమూతలు ఆడుకోవాలనుకున్నారు. ఓ బాలిక మాత్రం ఎవరికీ దొరకక కూడదని ఉద్దేశంతో స్కూల్ వెనక్కి వెళ్ళింది. అదే ఆమె పాలిట శాపమైంది. కరెంట్ షాక్ ఆ చిన్నారి ప్రాణం తీసింది. శాశ్వతంగా తన స్నేహితులకు దొరకనంత దూరం తీసుకువెళ్ళింది. ఈ విషాదం వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. లింగాల అనూషకు ఇద్దరు కుమార్తెలు, భర్తతో గొడవల కారణంగా కొంత కాలంగా పుట్టింట్లోనే ఉంటుంది. ఆమె పెద్ద కుమార్తె రాజేశ్వరి (11) మూడురోజుల కిందటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి లో చేరింది.
ఆ రోజు సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో ఉపాధ్యాయులు ఆడుకునేందుకు అనుమతించడంతో బాలికలంతా జట్లుగా విడిపోయి దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. కాసేపటి తర్వాత దాక్కునే క్రమంలో రాజేశ్వరి పాఠశాల భవనం వెనక్కి వెళ్ళింది. బోరు బావికి అనుసంధానించిన విద్యుత్తు తీగ కాళ్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. బాలిక కేకలతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బాధిత చిన్నారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
