వందల ప్రాణాలు కాపాడిన వండర్ కిడ్... అడ్డంగా నిలబడి రైలును ఆపిన సాహస బాలుడు
ఓ పదేళ్ల బాలుడి ధైర్య సాహసాలు, సమయస్పూర్తి వందలాది మంది ప్రాణాలు కాపాడాయి. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లో వెలుగుచూసింది.

పశ్చిమ బెంగాల్ : ఇటీవల ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ లో రైలు ప్రమాదం సృష్టించిన మారణహోమాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. రైలు ఎక్కాలంటేనే బయపడుతున్న సమయంలో అక్కడక్కడా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ బాలుడి ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన బాలుడు వేగంగా వెళుతున్న రైలుకు అడ్డంగా నిలబడి ఆపాడు. ఇలా వందలాదిమంది మందితో వెళుతున్న రైలు సురక్షితంగా గమ్యం చేరడానికి సదరు బాలుడే కారణమని చెప్పాలి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లా కరియాలి గ్రామంలో పదేళ్ళ బాలుడు ముర్సలీమ్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. గత శుక్రవారం అతడు గ్రామ సమీపంలోని ఓ చెరువలో చేపలు పట్టడానికి వెళుతూ రైలు పట్టాలవద్దల చేరుకున్నాడు. పట్టాలు దాటుతుండగా ప్రమాదకరమైన గొయ్యిని అతడు గుర్తించాడు. సరిగ్గా రైలు పట్టాలపైనే కంకర కొట్టుకుపోయి గుంత ఏర్పడింది. దీంతో ఈ పట్టాలపై వెళితే రైలు ప్రమాదానికి గురవుతుందని బాలుడు అనుమానించాడు. దీంతో ఎలాగయినా ఈ ప్రమాదాన్ని ఆపాలని భావించిన బాలుడు సమయస్పూర్తిని ప్రదర్శించాడు.
అగర్తలా-సియాల్దా కాంచన్ జుంగా ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా దూసుకొస్తున్నా ముర్సెలీమ్ ధైర్యంగా పట్టాలపైనే నిలబడ్డాడు. తను ధరించిన ఎర్రని టీషర్ట్ ను విప్పి గాల్లో ఊపడం ప్రారంభించాడు. ఇది గమనించిన లోకో పైలట్ అత్యవసరంగా రైలును ఆపాడు. బాలుడి వద్దకు వెళ్లిచూడగా రైలు పట్టాలపై గొయ్యి వుంది. దీంతో లోకో పైలట్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని గొయ్యిని పూడ్చారు. గంటసేపటి తర్వాత రైలు అక్కడినుండి కదిలింది.
Read More రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అప్రమత్తమైన అధికారులు.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదాన్ని గుర్తించడమే కాదు సమయస్పూర్తితో రైలును ఆపిన ముర్సెలీమ్ ప్రశంసలు అందుకుంటున్నారు. రైల్లోని ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు బాలుడి ధైర్యసాహసాలను, రైలును ఆపిన విధానాన్ని అద్భుతమని కొనియాడుతున్నారు. ఈ బాలుడి ధైర్యసాహసాలకు తగిన గుర్తింపు లభించాలని... అందుకోసం ప్రభుత్వం అందించే అవార్డులకు ఇతడి పేరును సిపారసు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.