డీజిల్ కార్లపై అదనంగా పది శాతం జీఎస్టీ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ
కాలుష్య నివారణ కోసం డీజిల్ కార్ల విక్రయాలపై అదనంగా పది శాతం జీఎస్టీ విధిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందిస్తూ ఇది తప్పుదోవ పట్టిస్తున్నదని, ఇలాంటి ప్రతిపాదనలేవీ ప్రభుత్వ పరిగణనలో లేవని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. డీజిల్ వాహనాల విక్రయాలు తగ్గించడానికి వాటిపై అదనంగా పది శాతం జీఎస్టీ వేస్తామని కామెంట్ చేసినట్టు ఆ వార్తలు చెప్పాయి. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని, మీడియాలో ఒక తప్పుడు వార్త ప్రచారం అవుతున్నదని అన్నారు.
‘డీజిల్ వాహనాలపై పది శాతం అదనపు జీఎస్టీ విధిస్తామని వచ్చిన మీడియా వార్తలపై వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం పరిగణనలో ఈ ప్రతిపాదన లేదని చెప్పడం ఆవశ్యకం’ అని నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి 2070 కల్లా నికర కార్బన్ శూన్యానికి తగ్గించడానికి ప్రత్యామ్నాయ చమురు అవసరం. అవి క్లీనర్, గ్రీనర్ అయి ఉండాలి. ఇవి దిగుమతులకు ప్రత్యామ్నాయంగా, చౌకగా, దేశీయంగా, కాలుష్యరహితంగా ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read: ‘ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్‌కే.. రాసిపెట్టుకోండి’.. చేరికల సభలో పొంగులేటి, భట్టి
మన దేశంలో డీజిల్ కార్లు కొనుగోలు చేయడంపై అదనంగా పది శాతం జీఎస్టీ వధించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఓ వార్త వచ్చింది. అయినా.. కంపెనీలు డీజిల్ కార్లను అలాగే విక్రయిస్తే మాత్రం ఈ పన్నును మరింత పెంచుతామని హెచ్చరిస్తున్నట్టు అందులో ఉన్నది. ఈ వార్త అవాస్తవం అని తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు.
టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకీ, విదేశీ కార్ల కంపెనీలు మెర్సిడెస్, వోక్స్ వేగన్ వంటి కంపెనీల ప్రతినిధులు ఢిల్లీలో ఆటోమేకర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంలో ఈ వార్త చర్చనీయాంశమైంది.