కేరళలో చోరీలకు పాల్పడుతున్న తెలంగాణ యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కేరళ రాజధాని తిరునంతపురంకు విమానాల్లో వెళ్లి, స్టార్ హోటల్స్‌లో మకాం వేసి.. చోరీలకు పాల్పడ్డాడు.

కేరళలో చోరీలకు పాల్పడుతున్న తెలంగాణ యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కేరళ రాజధాని తిరునంతపురంకు విమానాల్లో వెళ్లి, స్టార్ హోటల్స్‌లో మకాం వేసి.. చోరీలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చేసేవాడు. పక్కా ప్లాన్‌తో గత కొంత కాలంగా చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. అయితే మరోసారి చోరీ చేసేందుకు తిరువనంతపురం చేరుకోగా.. అక్కడి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడిని తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఉమాప్రసాద్‌గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరువనంతపురం పోలీసు కమిషనర్ సీహెచ్ నాగరాజు మీడియాకు వెల్లడించారు. 

ఉమా ప్రసాద్ ఆటోలో నగరంలో చుట్టూ తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడని పోలీసు కమిషనర్ తెలిపారు. రాత్రిపూట గూగుల్ మ్యాప్‌లను ఉపయోగించి అక్కడికి చేరుకుని బంగారు ఆభరణాలను దొంగిలించేవాడని చెప్పారు. పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో రూ. 5.27 లక్షల విలువైన ఆభరణాలు, ఫోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు ఇళ్లలో రూ. 77,000 విలువైన ఆభరణాలు చోరీ చేశాడు. 

‘‘నిందితుడు మే 28న హైదరాబాద్ నుంచి విమానంలో తొలుత నగరానికి వచ్చాడు. ఈ పర్యటనలో అతడు శ్రీపద్మనాభస్వామి దేవాలయంతోపాటు నగరంలోని పర్యాటక ప్రదేశాలు, ఆలయాలను సందర్శించాడు. ఈ పర్యటనలో నగల చోరీకి సంబంధించి అతను ప్రాథమిక ప్రణాళికలు రూపొందించినట్లు భావిస్తున్నాం. నాలుగు రోజుల తరువాత అతను మరొసారి నగరానికి తిరిగి వచ్చాడు. ఈసారి అతను జూలై 1న వరకు నగరంలోనే ఉన్నాడు. ఆటోరిక్షాలలో నగరం చుట్టూ విస్తృత పర్యటనలు చేసినట్లు తెలిసింది. ఎక్కువగా అతను బస చేసిన హోటళ్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోని ఇళ్లలో ఆభరణాలు చోరీ చేశాడు. 

అయితే ఈ ఆభరణాల చోరీ కేసులపై విచారణ జరుపుతున్న పోలీసులు ఒక ఇంటి సమీపంలోని సీసీటీవీ విజువల్స్‌ను విశ్లేషిస్తూ నిందితుడి ప్రయాణించిన ఆటోరిక్షాను గుర్తించారు. తర్వాత ఆటోరిక్షా డ్రైవర్ లొకేషన్‌ను గుర్తించారు. ఒక హోటల్ నుంచి నిందితుడిని పికప్‌ చేసినట్టుగా తేలింది. హోటల్ నుంచి నిందితుడి గుర్తింపుపై పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. తదుపరి ట్రాకింగ్ సమయంలో.. అతను బుధవారం ఉదయం తిరువనంతపురంకు వచ్చే విమానాన్ని బుక్ చేసుకున్నట్లు తేలింది. ఎయిర్‌పోర్టు నుంచి వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది’’ అని చెప్పారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇళ్లలోకి చొరబడేందుకు ఉమాప్రసాద్ నిత్యం కటింగ్ టూల్స్ వాడేవాడు. తన ముఖం ఏ సీసీటీవీ కెమెరాలోనూ చిక్కకుండా చూసుకున్నాడు. చోరీకి గురైన నగలను వివిధ ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టాడు. అందుకే అతడి చోరీలను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. అయితే అతడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.