తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్‌లకు కూడా ఉందని అన్నారు.

తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్‌లకు కూడా ఉందని అన్నారు. రాజకీయ చర్చల్లో పాల్గొనేందుకు రాజకీయ పార్టీల నేతలకు ఉన్న హక్కు గవర్నర్‌లకు ఉంటుందని.. వారి అభిప్రాయాలను ముందుకు తెచ్చే హక్కు ఉందని తెలిపారు. ‘‘రాజకీయ చర్చల్లో అందరూ పాల్గొంటారు కాబట్టి గవర్నర్‌లకు కూడా ఆ చర్చకు స్వేచ్ఛ ఉండాలి’’ అని తమిళిసౌ సౌందర్‌రాజన్ అన్నారు. 

తమిళిసౌ సౌందర్‌రాజన్ తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అందరూ రాజకీయాలు మాట్లాడుతున్నారు. గవర్నర్ రాజకీయాలు ఎందుకు మాట్లాడకూడదు? అందరిలాగే గవర్నర్‌లకు కూడా ఆ హక్కు ఉంది. తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు వారికి ఉంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్‌ అభిప్రాయంతో విభేదాలు వ్యక్తం చేసినప్పటికీ.. వారి పట్ల నిరసన వ్యక్తం చేయడం లేదా శత్రుత్వం ప్రదర్శించడం మంచి రాజకీయాలకు అనుకూలం కాదని ఆమె ఉద్ఘాటించారు.

అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి సమస్యపై మాట్లాడే రాజకీయ నాయకుడు గవర్నర్‌ కాదని అన్నారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘గవర్నర్ ప్రెస్ మీట్ చేయకూడదని మా స్టాండ్. ఎందుకంటే గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదు. నేను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అయినప్పటికీ.. అది తప్పుడు ఉదాహరణగా నిలుస్తుందని నా అభిప్రాయం.అసెంబ్లీ లోపల ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు గవర్నర్‌కు ఉంది... ప్రతిరోజూ ప్రతిస్పందించడం వారి పదవి గౌరవాన్ని తగ్గిస్తుంది’’ అని అన్నామలై పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరులో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తమిళిసై సౌందర్‌రాజన్.. పైన పేర్కొన్న విధంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.