తెలంగాణ వద్ద కర్ణాటకకు ఇవ్వడానికి బియ్యం లేవని కేసీఆర్ తనతో అన్నాడని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం 1.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించడానికి సిద్ధంగా ఉన్నదని, కానీ, ధర ఎక్కువగా ఉన్నదని తెలిపారు. 

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ అన్న భాగ్య పథకాన్ని అమలు చేయడానికి తంటాలు పడుతున్నది. తాజాగా, ఈ ప్రయత్నాల్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకకు ఇవ్వడానికి తెలంగాణ వద్ద బియ్యం లేవని చెప్పినట్టు సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుతో మాట్లాడారు. కర్ణాటకకు బియ్యం ఇవ్వండని అడిగారు. కానీ, కర్ణాటకకు ఇవ్వడానికి తమ వద్ద సరిపడా బియ్యం లేవని కేసీఆర్ తెలిపినట్టు ఆయన విలేకరులకు వెల్లడించారు.

కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గడ్‌నూ సీఎం సిద్ధరామయ్య అప్రోచ్ అయ్యారు. వారు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. అయితే.. వారు కేవలం 1.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉన్నారని వివరించినట్టు పేర్కొన్నారు. కానీ, ధర ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అలాగే, రవాణా ఖర్చు కూడా అధికంగా ఉన్నదని సిద్ధరామయ్య వివరించారు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌తోనూ టచ్‌లోకి వెళ్లాలని ప్రధాన కార్యదర్శి వందిత శర్మను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. నేను ఒక మీటింగ్‌ను నిర్వహిస్తున్నాను. ఏం జరుగుతందో చూడాలి అంటూ సిద్ధరామయ్య అన్నారు.

కర్ణాటక అన్న భాగ్య పథకాన్ని అమలుచేయ సంకల్పించింది. ఈ పథకంలో ఒక్కరికి పది కిలోల బియ్యం అవసరం ఉన్న కుటుంబాలను గుర్తించి.. వారికి తల ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు చేయడానికి కర్ణాటక రాష్ట్రానికి మొత్తం 4.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 2.17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. మిగిలిన 2.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రమే స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి సమకూర్చుకుంటేనే అదనంగా ఐదు కిలోల బియ్యాన్ని ఇవ్వడం వీలవుతుంది.

Also Read: Adipurush: డైలాగ్‌లు హిందువుల మనోభావాలను గాయపరిచాయి: సినిమాను సమర్థించిన బీజేపీ నేతలపై ఆప్ ఫైర్

ఇదే వారంలో మోడీ ప్రభుత్వంపై ఈ విషయమై సిద్ధరామయ్య విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం అన్న భాగ్య పథకాన్ని నిలిపేయడానికి కుట్ర చేసిందని ఆరోపించారు. అదనపు 2.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించడానికి(ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా) కర్ణాటక విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని ఎఫ్‌సీఐ ఆమోదించిందనీ సిద్ధరామయ్య జూన్ 12వ తేదీన వెల్లడించారు. అయితే, జూన్ 13న కేంద్ర మంత్రి ఎఫ్‌సీఐకి లేఖ రాస్తూ.. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్‌ను రాష్ట్రాలకు నిలిపేసినట్టు పేర్కొన్నారు.

దీంతో సిద్ధరామయ్యకు ఆ బియ్యం రాకుండా ఆగిపోయాయి. అందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే అన్న భాగ్య పథకాన్ని ఆపేసే కుటిల యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. 

నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచే రాష్ట్రాలకు పంపిణీ అవుతాయన్న విషయం తెలిసిందే.