చంపై సర్కార్ బలపరీక్ష వేళ ... సీఎం రేవంత్ జార్ఖండ్ పర్యటన
జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రానికి బయలుదేరారు.
హైదరాబాద్ : మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్, నూతన సీఎంగా చంపాయ్ సోరెన్ బాధ్యతలు, ఇవాళ అసెంబ్లీ బలపరీక్ష... ఇలా జార్ఖండ్ రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేవంత్ జార్ఖండ్ కు పయనమయ్యారు.
అయితే జార్ఖండ్ రాజకీయాలతో సంబంధంలేకుండా రేవంత్ పర్యటన సాగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత న్యాయయాత్ర ప్రస్తుతం జార్ఖండ్ లోనే కొనసాగుతోంది. ఇందులో పాల్గొనేందుకే రేవంత్ జార్ఖండ్ వెళుతున్నారు. రాహుల్ గాంధీని కలిసి యాత్రలో పాల్గొననున్న రేవంత్ సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
జార్ఖండ్ లో జెఎంఎం ప్రభుత్వ బలపరీక్ష :
ముఖ్యమంత్రి పదవిలో వుండగానే హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడంతో జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. హేమంత్ స్థానంలో నూతన ముఖ్యమంత్రిగా జెఎంఎం నేత చంపై బాధ్యతలు స్వీకరించారు. బల పరీక్ష ఎదుర్కోవాల్సి రావడంతో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జెఎంఎం కూటమి జాగ్రత్తపడింది... ముందుజాగ్రత్తగా ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ కు తరలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వుండటంతో తమ ఎమ్మెల్యేల క్యాంప్ కు తెలంగాణ సేఫ్ అని భావించినట్లుంది జెఎంఎం కూటమి. బలపరీక్ష నేపథ్యంలో తాజాగా క్యాంప్ లో వున్న ఎమ్మెల్యేలంతా జార్ఖండ్ కు చేరుకున్నారు.
ఇవాళ(సోమవారం) జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ తనవద్ద వుందని చంపై నిరూపించుకోవాల్సి వుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రాంచీ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలంతా ఓ హోటల్లో బసచేసారు. వీరంతా మరికొద్దిసేపట్లో అసెంబ్లీకి చేరుకోనున్నారు. బలపరీక్షలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.