మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.  పదవుల కోసం సొంత పార్టీలనే చీల్చుకుంటూ వేరే పార్టీలోకి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. శనివారం ముఖ్యమంత్రి సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాలు పదవుల వెంట పరుగులు పెడుతున్నాయన్నారు. పదవుల కోసం సొంత పార్టీలనే చీల్చుకుంటూ వేరే పార్టీలోకి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని కేసీఆర్ హెచ్చరించారు. అభివృద్ధి నిరోధకులను గెలిపించుకుంటూ కనీస వసతులు లేకుండా ఇంకెన్నాళ్లు వుందామని సీఎం ప్రశ్నించారు.

బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మహారాష్ట్ర ముందుకే వచ్చిందని.. తలుపులు తెరిచి ఆహ్వానించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ మోడల్ అమలు చేయడం మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదో చూద్దామని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని .. త్వరలోనే షోలాపూర్‌లో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. 

ALso Read: గుజరాత్‌కు రూ.20 వేల కోట్ల ప్రాజెక్ట్ .. తెలంగాణకేమో రిపేర్ షాప్, గుణపాఠం తప్పదు : మోడీకి కేటీఆర్ కౌంటర్

కాగా.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యమతున్న వేళ .. మహారాష్ట్ర ఎన్‌సీపీలో నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. శరద్‌ పవార్‌ పార్టీలో చీలిక జరిగింది. NCP నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన అజిత్ పవార్ (Ajit pawar) అధికార బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ మరో బాంబు పేల్చారు. ఎన్‌సీపీ పార్టీ, ఎన్నికల గుర్తు తన వద్దే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తానని ప్రకటించారు. తాము ఒక పార్టీగానే (NCP) మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరామని, ఎన్‌సీపీ గుర్తుతోనే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.