కేంద్ర దర్యాప్త సంస్థ సీబీఐపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ రాష్ట్రాల్లోకి ఇష్టమొచ్చినట్లు చొరబడటానికి వీల్లేదని.. దానికి అనుమతిని నిరాకరించాలని కేసీఆర్ అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావడంతో ఢిల్లీ, హైదరాబాద్‌లలో ప్రకంపనలు రేగాయి. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ సన్నిహితులుగా చెబుతున్న పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లు , కార్యాలయాలపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ గుర్రుగా వున్నారు. ఈ క్రమంలో బీహార్ పర్యటనలో వున్న తెలంగాణ సీఎం .. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ లాంటి సంస్థ రాష్ట్రాల్లోకి చొరబడటం సరికాదన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమన్న కేసీఆర్.. బీహార్‌లో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని నిరాకరించే ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా ఇదే పని చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పి.. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి రాజకీయాలు కాకరేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్డీయే తో విడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీల నాయకులు ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడుల రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పుట్టించాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై బీహార్ అధికార పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తున్నాయి. బీహార్‌లో బ్యాక్‌డోర్ ద్వారా అధికారం దక్కించుకోవడానికి మహారాష్ట్ర తరహా ప్రణాళిక చేస్తున్నదని బీజేపీపై మహాగట్బంధన్ నాయకులు మండిపడ్డారు. అలాగే, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి స్వయంప్రతిపత్త సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని ఆర్జేడీ సీనియర్ నాయకుడు మనోజ్ కుమార్ ఝా అన్నారు.
ALso REad:కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ సర్కారు: మహాగట్బంధన్ నాయకులు
రాజకీయ పోరాటానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మానుకోవాలని మహాగట్బంధన్ నాయకులు(ఎంజీబీ) నాయకులు ఆదివారం నాడు బీజేపీ సర్కారుకు సూచించారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల మద్దతు ఉన్నదని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి రాదంటూ పేర్కొంటున్నారు. ఆర్జేడీ సీనియర్ నాయకుడు మనోజ్ కుమార్ ఝా మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లో బ్యాక్‌డోర్ నుండి నియంత్రించాలనే దాని మహారాష్ట్ర తరహా ప్రణాళిక తరువాత.. సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ టాక్స్ వంటి స్వయంప్రతిపత్త సంస్థలను నిమగ్నం చేశారని అన్నారు. గురుగ్రామ్‌లోని మాల్, ఇతర వ్యాపార సంస్థలపై సీబీఐ దాడులు చేయడంతో బీజేపీ ఇబ్బంది పడుతోంది.. ఎందుకంటే డిప్యూటీ సిఎం తేజస్వి ప్రసాద్ యాదవ్‌తో సంబంధాలను నిరాకరిస్తూ ప్రకటనలు వెలువడ్డాయి" అని ఝా అన్నారు.
కాగా, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ.. సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని బీహార్‌లోని అధికార మహాగట్బంధన్ నాయకులు పేర్కొన్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్‌పిఈ) చట్టం, 1946లోని సెక్షన్ 6 ప్రకారం, సీబీఐకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి సమ్మతి అవసరమన్నారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయాతో సహా తొమ్మిది రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను దర్యాప్తు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
