Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ స‌ర్కారు: మహాగట్బంధన్ నాయకులు

మహాగట్బంధన్ నాయకులు: బీహార్‌లో బ్యాక్‌డోర్ ద్వారా అధికారం ద‌క్కించుకోవ‌డానికి మహారాష్ట్ర తరహా ప్రణాళిక చేస్తున్న‌ద‌ని బీజేపీపై మహాగట్బంధన్ నాయ‌కులు మండిప‌డ్డారు. అలాగే, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి స్వయంప్రతిపత్త సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని ఆర్జేడీ సీనియర్ నాయకుడు మనోజ్ కుమార్ ఝా అన్నారు.
 

BJP government misusing central probe agencies: Mahagatbandhan leaders
Author
Hyderabad, First Published Aug 28, 2022, 11:38 PM IST

బీహార్ పాలిటిక్స్: భార‌తీయ జ‌న‌తా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మికి గుడ్ బై చెప్పి.. రాష్ట్రంలోని ఇత‌ర పార్టీల‌తో క‌లిసి నితీష్ కుమార్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత అక్క‌డి రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎన్డీయే తో విడిపోయిన త‌ర్వాత కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీల నాయ‌కులు ఇండ్ల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల వ‌రుస దాడుల రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రింత వేడిని పుట్టించాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై బీహార్ అధికార పార్టీలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని ఆరోపిస్తున్నాయి. బీహార్‌లో బ్యాక్‌డోర్ ద్వారా అధికారం ద‌క్కించుకోవ‌డానికి మహారాష్ట్ర తరహా ప్రణాళిక చేస్తున్న‌ద‌ని బీజేపీపై  మహాగట్బంధన్ నాయ‌కులు మండిప‌డ్డారు. అలాగే, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి స్వయంప్రతిపత్త సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని ఆర్జేడీ సీనియర్ నాయకుడు మనోజ్ కుమార్ ఝా అన్నారు.

రాజకీయ పోరాటానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మానుకోవాలని మహాగట్బంధన్ నాయకులు(ఎంజీబీ) నాయకులు ఆదివారం నాడు బీజేపీ స‌ర్కారుకు సూచించారు. త‌మ ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రాదంటూ పేర్కొంటున్నారు. ఆర్జేడీ సీనియర్ నాయకుడు మనోజ్ కుమార్ ఝా మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లో బ్యాక్‌డోర్ నుండి నియంత్రించాలనే దాని మహారాష్ట్ర తరహా ప్రణాళిక తరువాత.. సీబీఐ, ఈడీ, ఇన్ క‌మ్ టాక్స్ వంటి స్వయంప్రతిపత్త సంస్థలను నిమగ్నం చేశారని అన్నారు. గురుగ్రామ్‌లోని మాల్, ఇతర వ్యాపార సంస్థలపై సీబీఐ దాడులు చేయడంతో బీజేపీ ఇబ్బంది పడుతోంది.. ఎందుకంటే డిప్యూటీ సిఎం తేజస్వి ప్రసాద్ యాదవ్‌తో సంబంధాలను నిరాకరిస్తూ ప్రకటనలు వెలువడ్డాయి" అని ఝా అన్నారు.

సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను ఉప‌యోగించుకోవ‌డం ద్వారా ప్రజలపై ‘కాలా జాదూ’ (బ్లాక్ మ్యాజిక్) ప్రయోగించాలన్న బీజేపీ ప్రయత్నం కార్యరూపం దాల్చదని బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (బీపీసీసీ) ప్రధాన అధికార ప్రతినిధి రాజేష్ రాథోడ్ ఎద్దేవా చేశారు.  తమ ఎన్నికల పునాది పూర్తిగా కొట్టుకుపోయిందని తెలుసుకున్న బీజేపీ నేతలు మానసిక సమతుల్యం కోల్పోయారని, అధికార సంకీర్ణ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వామపక్ష పార్టీలతో సహా ఎంజీబీ నేతలు తెలిపారు. "మహాగట్బంధన్ ప్రభుత్వానికి 164 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అట్టడుగు స్థాయిలో తమకు భారీ మెజారిటీ ఉందని స్పష్టంగా సూచిస్తోంది" అని రాష్ట్ర జేడీ(యూ) నాయ‌కులు సంతోష్ కుష్వాహ అన్నారు.

కాగా, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ.. సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని బీహార్‌లోని అధికార మహాగట్బంధన్ నాయకులు పేర్కొన్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్‌పిఈ) చట్టం, 1946లోని సెక్షన్ 6 ప్రకారం, సీబీఐకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి సమ్మతి అవసరమ‌న్నారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయాతో సహా తొమ్మిది రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను దర్యాప్తు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.

రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్రం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని సీపీఐఎంఎల్(ఎల్) ఎమ్మెల్యే మెహబూబ్ ఆలం పేర్కొన్నారు. “కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ రాజకీయ ఉద్దేశాలతో పని చేస్తున్నాయి. అవి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించవు. బీహార్‌లోని మా మహాకూటమి ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని వెంటనే ఉపసంహరించుకోవాలి. రాష్ట్రంలో ఏజెన్సీ అధికారాలను కుదించాలి”అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios