తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో శుక్రవారం నాడు భేటీ అయ్యారు. ఢిల్లీ నుండి కేసీఆర్ రాంచీకి చేరుకొన్నారు.
న్యూఢిల్లీ నుండి తెలంగాణ సీఎం KCR రాంచీకి చేరుకొన్నారు. రాంచీలో నేరుగా బిర్సా ముండా చౌక్ కు చేరుకున్నారు. గిరిజన ఉద్యమ నేత, ఝార్ఖండ్ ప్రజల ఆరాధ్య నాయకుడు భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడనుంచి నేరుగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి సీఎం కేసిఆర్ చేరుకున్నారు. సీఎం హేమంత్ సోరేన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు.

గల్వాన్ లోయలో Chinaతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన కల్నల్ Santosh Babu కూడా ఉన్నారు. అయితే సంతోష్ బాబు కుటుంబంతో పాటు, మిగిలిన 19 మంది అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్–1 స్థాయి ఉద్యోగం.. మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున అందజేయనున్నట్టుగా చెప్పారు. గతంలో సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన కేసీఆర్ ప్రకటించిన సాయం అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి ఉద్యోగ నియమాక ప్రతాలు అందజేశారు. "
ఇప్పుడు మిగతా 19 మంది అమర జవాన్లను కుటుంబాలకు కూడా గతంలో ప్రకటించిన విధంగా రూ. 10 లక్షల చొప్పున సాయం అందజేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఇవాళ జార్ఖండ్ వెళ్లి ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నారు కేసీఆర్.
ఎన్డీయేతర పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.ఈ క్రమంలోనే హేమంత్ సోరేన్ తో సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ చర్చించారు.బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తన మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. అంతేకాదు ఆయా పార్టీలు, సీఎంలను కూడా కలుస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా కేసీఆర్ కు ఫోన్ చేశారు. హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు కేసీఆర్ తో భేటీ అయ్యారు.

వచ్చే ఎన్నికల నాటికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా కలిసి వచ్చే ఎన్డీయేతర పార్టీలను కలుపుకుపోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు చర్చలు జరుపుతున్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీకి చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రశాంత్ కిషోర్ టీమ్ తో కేసీఆర్ ప్రణాళికలను రచిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తమ క్రాయకలాపాలను ప్రారంభించింది. తెలంగాణ సర్కార్ ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇటీవల కాలంలో పరిశీలించింది.
