ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం
ప్రధానమంత్రి మోదీ ప్రయాణించనున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది,
ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్ విమానాశ్రయంలోనే ఆయన విమానం నిలిచిపోయింది.
జాతీయ గిరిజన దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం బిహార్ వెళ్లారు. ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆదివాసీ మహిళకు తాము రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మొదట్లో ఆ పదవికి ముర్ము పేరును ప్రతిపాదించగానే.. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు.
అనంతరం ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ దేవ్‌గఢ్ వెళ్లారు. అక్కడ ఎన్నికల ప్రసంగం ముగించుకుని దేవ్‌గఢ్ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కారు. అయితే, విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయారు. ఈ కారణంగా ప్రధాని మోదీ న్యూఢిల్లీకి రావడానికి షెడ్యూల్ కంటే ఆలస్యం అవుతుందని సమాచారం.