బడికెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు రీల్స్ చేశారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సిన వారే.. దానికి బానిసయ్యారు. లైక్స్, షేర్స్ కోసం స్టూడెంట్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో పలువురు టీచర్లు చేస్తున్న వింత పని దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రతీ రోజూ అక్కడే రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన తరువాత, లైక్స్ చేయాలని, ఫాలో కొట్టాలని, షేర్ చేయాలని స్టూడెంట్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి, ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి. అమ్రోహా జిల్లాలోని ఓ పాఠశాలలో పలువురు మహిళా టీచర్లు స్కూల్ కు వెళ్లిన తరువాత రీల్స్ చేస్తున్నారు. వాటికి వ్యూవ్స్ పెరిగేలా కృషి చేయాలని స్టూడెంట్లను కోరారు. లైక్స్ చేయాలని, షేర్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. డ్యూటీ టైమ్ లోనే వారు ఇవన్నీ చేయడం గమనార్హం. తాము చెప్పినట్టు చేయకపోతే బాగుండదని కూడా వారిని బెదిరించారు. ఓ టీచర్ ఈ వీడియోలను రికార్డు చేస్తుండగా.. మరి కొందరు టీచర్లు రీల్స్ ఉన్న మ్యూజిక్ కు తగిన విధంగా డ్యాన్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

సోషల్ మీడియాకు బానిస కాకూడదని, చదువుపై శ్రద్ధ పెట్టాలని, క్రమ శిక్షణగా ఉండాలని చెప్పాల్సిన టీచర్లే ఈ విధంగా చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వ్యవహారంపై స్టూడెంట్లు వారి తల్లిదండ్రుల దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో స్టూడెంట్ల తల్లిదండ్రులంతా కలిసి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ను ఆశ్రయించారు. డ్యూటీ టైమ్ లో రీల్స్ చేస్తూ, లైక్స్ చేయాలని తమ పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. 

దీంతో జిల్లా మేజిస్ట్రేట్ స్పందించారు. దీనిపై విచారణ జరపాలని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగేశ్వరి ఆర్తి గుప్తా ను ఆదేశించారు. దీంతో ఆ అధికారి విచారణ చేపట్టారు. స్కూల్లో సోషల్ మీడియా కోసం వీడియోలను రికార్డ్ చేస్తున్న టీచర్లను అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్గా గుర్తించారు. అయితే తాము రీల్స్ చేయడం లేదని, పిల్లలకు పలు విషయాలు అర్థం అయ్యేలా చెప్పేందుకు వీడియోలు తీస్తామని వారు బదిలిచారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.