పశ్చిమ బెంగాల్‌లో స్కూల్‌లో మిడ్ డే మీల్‌లో చికెన్ కూడా పెడుతున్నారు. ఈ వంటకం పెట్టినప్పుడు క్వాలిటీ చికెన్‌ను అంటే..లెగ్ పీస్‌లు, ఇతర మాంసం ఎక్కువ ఉండే పీస్‌లను టీచర్లు తీసుకుని ప్రత్యేకంగా వండుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ పిల్లల పేరెంట్స్ ఏకంగా స్కూల్‌కు వెళ్లి టీచర్లను గదిలో బంధించారు. 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ స్కూల్స్‌లో మిడ్ డే మీల్ స్కీమ్‌లో ప్రభుత్వం చికెన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ చికెన్ వంటకం కోల్‌కతాలోని ఓ స్కూల్ టీచర్లకు తంటా తెచ్చి పెట్టింది. చికెన్ వండిన రోజున లెగ్ పీస్‌లు కనిపించకుండా పోతున్నాయని ఆరోపణలు హెచ్చాయి. దీంతో వారి తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి చికెన్ వంట చేసినప్పుడల్లా ఉపాధ్యాయులు ఒక పిక్నిక్ తరహా ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. లెగ్ పీస్‌లు, ఇతర మాంసం మంచిగా ఉన్న ముక్కలను టీచర్లు దాచుకుని ప్రత్యేకంగా వండించుకుని తింటున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, ఆరుగురు టీచర్లను నాలుగు గంటలపాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఓ గదిలో పెట్టి తాళం వేశారు.

ఈ ఘటన మాల్దా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్‌లోని అమృతి ప్రైమరీ స్కూల్‌లో గురువారం చోటుచేసుకుంది. పేరెంట్స్ లేవనెత్తిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లు అన్ని లెగ్ పీసులు, ఇతర మాంసాన్ని తీసుకుని తమ కోసం పక్కకు పెట్టుకుంటున్నారని పేరెంట్స్ ఆరోపించారు. విద్యార్థులకేమో కోడి మెడలు, లివర్లు, ఇతరత్రాలను వడ్డిస్తున్నారని పేర్కొన్నారు. మిడ్ డే మీల్‌లో చికెన్ వండిన రోజు ఉపాధ్యాయులు పిక్నిక్ మోడ్‌లోకి వెళ్లుతున్నారని, వారు క్వాలిటీ మీట్ తీసుకుని నాణ్యమైన రైస్ ప్రత్యేకంగా వండుకుంటున్నారని ఆరోపించారు. 

Also Read: షిప్ట్ టైమ్ పూర్తవ్వగానే సిస్టమ్ షట్ డౌన్.. ఇంటికి వెళ్లిపోవాలని వార్నింగ్ మెస్సేజీ.. ఆ కంపెనీ స్టోరీ వైరల్

విద్యార్థులు ఇంటికెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ గొడవ మొదలైంది. ఉపాధ్యాయులతో వారు వాగ్వాదానికి దిగారు. వారు ఆరుగురు ఉపాధ్యాయులను ఓ గదిలోకి తీసుకుని నాలుగు గంటలపాటు నిర్బంధించారు. ఆ తర్వాత పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. వారిని విడిపించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆహారాన్ని విద్యార్థులకు అందకుండా చేయడం దురదృష్టకరం అని జిల్లా ప్రాథమిక విద్యా బోర్డు చైర్మన్ బసంతి బర్మన్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని స్కూల్ ఇన్‌స్పెక్టర్ ను ఆదేశించినట్టు వివరించారు.