తెలుగుదేశానికి మద్ధతుగా ఉంటాం: డీఎంకే ఎంపీ కనిమొళి

TDP MPs meets DMK MP Kanimozhi
Highlights

విభజన హామీలు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తోన్న పోరాటానికి ఎప్పుడూ తమ మద్ధతు ఉంటుందని డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు

విభజన హామీలు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తోన్న పోరాటానికి ఎప్పుడూ తమ మద్ధతు ఉంటుందని డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు ఇవాళ చెన్నైలో కనిమొళితో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయం.. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు.. వాటిని నెరవేర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తెలుగుదేశం ఎంపీలు కనిమొళికి వివరించారు.

దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు.. ఎంపీల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కనిమొళిని కలిసిన వారిలో మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, మురళి మోహన్ ఉన్నారు.  ఇటీవల కడపలో స్టీల్ ప్లాంట్ కోరుతూ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు కూడా కనిమొళి సంఘీభావం తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన హామీల సాధన కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం ఎంపీలు పోరాటానికి సిద్ధమయ్యారు. దీనికి మద్ధతు కోరుతూ దేశంలోని పలు పార్టీల ఎంపీలను కలుస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న టీఆర్ఎస్ ఎంపీ కేకే, జితేందర్ రెడ్డిలను కలిసి అండగా నిలబడాలని కోరారు.

loader