Asianet News TeluguAsianet News Telugu

ఏమైనా జరగొచ్చు..?  చంద్రబాబుతో స్టాలిన్ భేటీ... 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు మారుమోగుతోంది. ఆయన సపోర్ట్ లేనిదే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యంగా మారింది... దీంతో ఆయన నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన ఎన్డిఏకు మద్దతు తెలిపినా... ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది..

TDP Chief  Nara Chandrababu Meeting With Tamilnadu CM Stalin AKP
Author
First Published Jun 6, 2024, 8:21 AM IST

డిల్లి : లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల వేళ 'చార్ సౌ పార్' అంటూ  భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఊహల్లో తేలియాడిన బిజెపి పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయింది అన్నట్లుగా తయారయ్యింది. నాలుగువందలు కాదు కనీసం మూడు వందల సీట్లను కూడా ఎన్డిఏ కూటమి సాధించలేకసోయింది... బొటాబోటి మెజారిటీతో గెలిచింది. సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందనుకున్న బిజెపి కేవలం 240 సీట్లకే పరిమితం అయ్యింది. మరోవైపు ప్రతిపక్ష ఇండి కూటమి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 234 సీట్లు సాధించింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కొద్దిదూరంలోని ఈ కూటమి నిలిచింది. ఏదేమైనా ఎన్డిఏ మెజారిటీ సీట్లు సాధించింది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో దేశ రాజధానిలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఏదయినా జరగొచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు. 

ఎన్డిఏ కూటమిలో బిజెపి(240) తర్వాత అత్య ధిక సీట్లు సాధించిన పార్టీ తెలుగుదేశం... అలాగే మిత్రపక్షం జనసేన మరో 2 సీట్లు గెలిచింది. బిజెపికి సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బలం లేదు... కాబట్టి ఎన్డిఏ మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుదిశగా చర్చలు సాగుతున్నాయి. ఇందులో టిడిపిది కీలక పాత్రగా మారింది... టిడిపి సపోర్ట్ లేకుంటే ఎన్డిఏ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాదు. ఒకవేళ ఆయన మద్దతిస్తే ఇండి కూటమికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కూడా వున్నాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

అయితే నిన్న(బుధవారం) దేశ రాజధాని డిల్లీలో జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షాల భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. ప్రధాని పక్కనే కూర్చున్న ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా, మోస్ట్‌ పవర్‌ఫుల్‌ గా కనిపించారు. ఒకప్పుడు మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాసిన చంద్రబాబు ఇప్పుడు వారిని డిమాండ్ చేసే స్థాయికి చేరారు. చంద్రబాబు సపోర్ట్ కోసం మోదీ కూడా తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మూడోసారి ఎన్డిఏ ప్రభుత్వ ఏర్పాటుకు, ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి రంగం సిద్దమైంది. ఎన్డిఏ మిత్రపక్షాల మీటింగ్ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ల సపోర్ట్ ఎన్డిఏ సర్కార్ ఏర్పాటుకానుంది. కానీ కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు... సినిమా ఇంకా మిగిలే వుంది అనేలా అదే డిల్లీ వేదికన ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

ఎన్డిఏ మీటింగ్ లో పాల్గొని ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరిన చంద్రబాబు నాయుడితో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటి అయ్యారు. ఇండి కూటమి మీటింగ్ కోసం డిల్లీకి వెళ్లిన స్టాలిన్ కూడా స్వరాష్ట్రానికి తిరుగుపయనం అయిన సమయంలో చంద్రబాబును కలిసారు. డిల్లీ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, స్టాలిన్ కాస్సేపు భేటీ అయ్యారు. అయితే వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబును ఇండి కూటమిలో చేరాలని స్టాలిన్ ఏమైనా కోరారా? లేదంటే సాధారణ విషయాలే మాట్లాడుకున్నారా? అన్నది తెలియాల్సి వుంది. 

 

చంద్రబాబుతో భేటీ విషయాన్ని స్వయంగా స్టాలినే బయటపెట్టారు. ఇందులోనూ ఆయన వ్యూహం కనిపిస్తోంది. తమ చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తారన్న నమ్మకం వుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు స్టాలిన్.  చంద్రబాబు కేంద్రంలో కీలకంగా మారనున్నారు కాబట్టి దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడతారని విశ్వసిస్తున్నానంటూ స్టాలిన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

ఏదేమైనా చంద్రబాబుతో స్టాలిన్ భేటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎన్డిఏ కూటమిలో ఇది ఒకింత కలవరం సృష్టించవచ్చు... అలాగే ఇండి కూటమిలో కొత్త ఆశలు రేకెత్తించవచ్చు. ఎన్డిఏ మీటింగ్ కోసం డిల్లీకి వెళ్లే సమయంలో చంద్రబాబు  ఏమైనా జరగొచ్చు అంటూ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios