తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల భూపతి తన డ్రీమ్ బైక్‌ను రూ. 2.60 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇందులో వింతేముందని ఆలోచిస్తున్నారా? ఆయన ఆ రూ. 2.60 లక్షలను మొత్తం ఒక్క రూపాయి కాయిన్‌ల రూపంలో షోరూమ్‌లో పరిచాడు. వాటిని పది మంది పది గంటల పాటు లెక్కించారంటే అతిశయోక్తి కాదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు తన డ్రీమ్ బైక్ బజాజ్ డామినార్‌ను వెంట తీసుకెళ్లాడు. 

చెన్నై: నేటి యువతకు బైక్‌పై మోజు అంతా ఇంతా ఉండదు. ఎలాగైనా కొని తీరాల్సిందే అని కంకణం కట్టుకునే వరకు ఈ ఇష్టం ఉంటుంది. కొందరేమో తల్లితండ్రులపై ఒత్తిడి తెచ్చి బైక్‌ను సాధించుకుంటారు. మరికొందరేమో సొంతంగా కష్టపడి కొనుక్కుంటారు. ఇంకొందరు డబ్బును తక్కువ మొత్తాల్లోనైనా పోగు చేసి ఏళ్ల తరబడి ఎదురుచూసి వారి డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకుంటాంటారు. తమిళనాడులోని ఓ యువకుడు ఈ మూడో కోవకు చెందిన వ్యక్తే. ఆయన తన డ్రీమ్ బైక్ కొనుగోలు చేయడానికి కనీసం మూడు సంవత్సరాలుగా రూపాయి రూపాయి కూడబెట్టుకున్నాడు. ఆ బైక్‌ను కొనుగోలు చేయడానికి ఏకంగా రూ. 2.60 లక్షలను వన్ రూపీ కాయిన్స్ రూపంలో ఓ వ్యాన్‌లో బైక్ షోరూమ్ దగ్గరకు తీసుకెళ్లాడు.

ఈ అరుదైన ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. సేలం జిల్లాకు చెందిన 29 ఏళ్ల వీ భూపతి బీసీఏ స్టూడెంట్. ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ చానెల్ పెట్టుకున్నాడు. ఆయనకు ఎప్పటి నుంచే బజాజ్ డామినర్ బైక్ కొనాలని కలలు కన్నాడు. అందుకోసం సొమ్ము పోగు చేసుకోవాలని అనుకున్నాడు. మూడేళ్లుగా ఒక్కొక్క రూపాయి బైక్ కోసం దాచుకున్నాడు. శనివారం తన డ్రీమ్ బైక్ బజాజ్ డామినర్ కొనుక్కోవాల్సిందేనని ఫిక్స్ అయ్యాడు. ఓ వ్యాన్‌లో తాను పోగు చేసిన ఒక్క రూపాయి కాయిన్‌లను తీసుకుని షోరూమ్ ముందు వాలాడు.

బజాజ్ డామినర్ బైక్ కొనాలనుకుంటున్నానని చెప్పగానే సిబ్బంది ఆ బైక్ గురించి వివరాలు చెప్పసాగారు. కానీ, కొనుగోలు కోసం ఆయన తెచ్చిన ఒక్క రూపాయి కాయిన్స్ గురించి వినగానే.. ఆ షోరూమ్ సిబ్బందితోపాటు షోరూమ్ సూపర్‌వైజర్ మహావిక్రాంత్ షాక్ అయ్యారు. తొలుత తాను ఆ డీల్‌కు ఒప్పుకోలేదు మహావిక్రాంత్. ఎందుకంటే, రూ. 2.60 లక్షల మొత్తాన్ని ఒక్క రూపాయి కాయిన్‌లతో లెక్కించడాన్ని ఆయన ఊహించనైనా లేదు.

కానీ, భూపతి తన డ్రీమ్ బైక్ కొనుగోలు ఆగిపోతుందా? అని చాలా మదనపడ్డాడు. దీన్ని గమనించి షోరూమ్ సూపర్‌వైజర్ మహావిక్రాంత్ కాస్త మెత్తబడ్డాడు. ఆయన తిరస్కరించడానికి కారణాలు ఇలా చెప్పాడు. రూ. 2000 నోట్లనైనా రూ. 100000 కౌంట్ చేయడానికి బ్యాంక్ సిబ్బంది కమీషన్‌గా రూ. 140 తీసుకుంటారని వివరించాడు. కాబట్టి, ఒక్క రూపాయి లెక్కింపు తలకు మించిన భారం అని, మొత్తం కాయిన్ల రూపంలోనే చెల్లించడానికి మహావిక్రాంత్ అంగీకరించలేదు. కానీ, భూపతిని డిజప్పాయింట్ చేయడం ఇష్టం లేక.. సంవత్సరాలుగా కలలు గన్న తన డ్రీమ్ బైక్‌ను కొనుగోలు చేయడంలో సహకరించాలనే ఉద్దేశంతోనే తాను ఈ బేరానికి అంగీకరించినట్టు వివరించారు.

అయితే, రూ. 2.60 లక్షల రూపాయలను లెక్కించడానికి పది గంటలు పట్టిందని ఆయన తెలిపారు. ఈ లెక్కింపులో భూపతి, ఆయన నలుగురు మిత్రులు, షోరూమ్‌కు చెందిన ఐదుగురు వర్కర్లు మునిగిపోయారని పేర్కొన్నారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫైనల్‌గా భూపతి తన ఫేవరేట్ బైక్ పొందాడని వివరించారు.