తమిళనాడులో కుల రక్కసి బుసలు కొట్టింది. దళితులు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించారని కొన్ని హిందు కులాలు ఆందోళనలకు దిగాయి. దళితులకు అండగా మంత్రి కామెంట్ చేయగా.. ఆయననూ వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చారు.
చెన్నై: తమిళనాడులో మరోసారి కుల వివక్ష వెలుగు చూసింది. దళితులు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించారని ఆ గ్రామంలోని హిందువులు ఆందోళనలకు దిగారు. దళితులను అడ్డుకోరాదని రాష్ట్ర మంత్రి అన్నందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ నినాదాలు ఇచ్చారు. ప్రభుత్వం వారికి ఇచ్చిన ఆధార్, ఓటర్ వంటి గుర్తింపు కార్డులను తిరస్కరిస్తామని హెచ్చరించారు. ఈ ఘటన తమిళనాడులోని విలుప్పురం జిల్లా కొలియనూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఓ పండుగ సందర్భంగా గ్రామ సమీపంలోని 300 ఏళ్ల నాటి ద్రౌపది అమ్మన్ ఆలయంలోకి దళితులు ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. వారిని గ్రామంలోని హిందువులు అడ్డుకన్నారు. ఆ గొడవ పోలీసులతోనూ ఘర్షణకు దారి తీసింది.
Also Read: Note Ban: ఏడేళ్లలోనే రూ. 2000 నోట్లను ఆర్బీఐ ఎందుకు రద్దు చేస్తున్నది? వివరణ ఏం ఇచ్చింది?
ఇదిలా ఉండగా గ్రామంలోని దళితులు కూడా నిరసనలకు దిగారు. మెయిన్ రోడ్‌ను దిగ్బంధించారు. వలవనూర్ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
జిల్లా కలెక్టర్ ఆఫీసు పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి కే పొన్ముడిని వారు కలిశారు. ఆలయంలోకి వెళ్లకుండా దళితులను అడ్డుకుంటున్న వారందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర మంత్రి పొన్ముడి వ్యాఖ్యలను నిరసిస్తూ హిందువులు ఆలయం ఎదుట నిరసనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఆధార్, రేషన్ కార్డులనూ వెనక్కి ఇవ్వడానికి ప్రయత్నించారు.
ఆ హిందువుల ఆందోళనలను సద్దుమణిగించే ప్రయత్నం రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఒకరు చేశారు. దీంతో ముగ్గురు హిందువులు కిరోసిన్ పైన పోసుకుని సజీవ దహనం చేస్తామని బెదిరించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు.
