‘మీ కొడుకు ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు?’.. అమిత్ షా వారసత్వ పార్టీ విమర్శలకు ఉదయనిధి స్టాలిన్ గట్టి కౌంటర్
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కేంద్ర హోం మంత్రి చేసిన వారసత్వ రాజకీయాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యానని, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని వివరించిన ఉదయనిధి స్టాలిన్.. అమిత్ షా కొడుకు ఏ ప్రాతిపదికన బీసీసీఐ సెక్రెటరీ అయ్యాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా కొడుకు ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు? ఎన్ని పరుగులు తీశాడు? అంటూ ప్రశ్నించారు.

చెన్నై: ప్రాంతీయ పార్టీలపై బీజేపీ చేసే విమర్శల్లో ప్రధానంగా వారసత్వ రాజకీయాలు అనే టాపిక్ కచ్చితంగా ఉండి తీరుతుంది. ఇటీవలే తమిళనాడు వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. అక్కడి అధికార పార్టీ డీఎంకేపై ఇవే విమర్శలు చేశారు. డీఎంకే వారసత్వ పార్టీ అని, ఎంకే స్టాలిన్ తన కొడుకును మినిస్టర్ చేశారని, రేపు అదే పార్టీ ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నదని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలను కౌంటర్ చేస్తూ.. అమిత్ షా కొడుకును ప్రస్తావించారు. అమిత్ షా కొడుకు ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు? ఎన్ని పరుగులు తీశాడు? ఆయనను బీసీసీఐ సెక్రెటరీగా ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అంటూ ఉదయనిధి స్టాలిన్ విరుచుకు పడ్డారు.
తమిళనాడులో బీజేపీకి ప్రతికూల వాతావరణమే ఉన్నది. ప్రధాని మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించినా ఎక్కడోచోట నిరసనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే.. తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నమళై కొంత మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీని ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు. తాజాగా, రామేశ్వరం నుంచి ఆయన పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రను ప్రారంభించడానికి కేంద్ర మంత్రి అమిత్ షా వెళ్లారు. కే అన్నమళై పాదయాత్రను ప్రారంభిస్తూ డీఎంకే పై అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. డీఎంకే వారసత్వ పార్టీ అని విమర్శించారు. ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మంత్రి అయ్యాడని, ఇంకొంత కాలానికి ఆయనను సీఎం చేస్తారనీ ఆరోపించారు.
Also Read: బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత, హాస్పిటల్‌లో చేరిక.. ‘కండీషన్ క్రిటికల్’
తాజాగా, చెన్నైలో డీఎంకే యూత్ వింగ్ కొత్తగా నియమితులైన ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ఉదయనిధి మాట్లాడారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచానని వివరించారు. ఆ తర్వాతే తాను మంత్రిని అయ్యానని చెప్పారు. మరి.. అమిత్ షా కొడుకు ఏం చేశాడని బీసీసీఐ సెక్రెటరీని చేశారని నిలదీశారు.
‘డీఎంకే నేతలు నన్ను సీఎం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారని అమిత్ షా అన్నారు. కానీ, నేను అమిత్ షాను ఓ విషయం అడగాలనుకుంటున్నాను. మీ కొడుకు బీసీసీఐ సెక్రెటరీగా ఎలా అయ్యాడు? ఆయన ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు? ఎన్ని రన్స్ తీశాడు?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. మరిన్ని ప్రశ్నలు సంధిస్తూ తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.