బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత, హాస్పిటల్‌లో చేరిక.. ‘కండీషన్ క్రిటికల్’
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయనను చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సమస్యలతో హాస్పిటల్‌లో చేరారని ఉడ్‌లాండ్స్ హాస్పిటల్ బులెటిన్‌లో వెల్లడించింది.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో శనివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఉడ్‌లాండ్స్ మల్టీస్పషాలిటీలో ఆయనను చేర్చారు. హాస్పిటల్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు.
ఆయన కండీషన్ క్రిటికల్‌గా ఉన్నదని, తాము పరీక్షిస్తున్నామని ఓ అధికారి న్యూస్ ఏజెన్సీ పీటీఐకి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కూడా 70 శాతానికి పడిపోయాయని వివరించారు. అప్పుడు ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, వెంటనే హాస్పిటల్‌కు తరలించినట్టు చెప్పారు.
ప్రస్తుతం కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు సహా పలు సీనియర్ వైద్యుల బృందం ఆయన చికిత్సను పర్యవేక్షిస్తున్నది.
79 ఏళ్ల బుద్ధాదేవ్ భట్టాచార్య లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సమస్యలతో హాస్పిటల్‌లో చేరారని ఉడ్‌లాండ్ హాస్పిటల్ ఓ బులెటిన్‌లో వెల్లడించింది. బుద్ధాదేవ్ భట్టాచార్యను నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, యాంటీ బయోటిక్లు, ఇతర సపోర్ట్ ఇచ్చినట్టు వివరించింది.
బుద్ధాదేవ్ భట్టాచార్య సతీమణి మీరా భట్టాచార్య, కూతురు సుచేతన భట్టాచార్య ఇద్దరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు.
Also Read: రాహుల్‌కు పెళ్లి చేసేద్దాం.. సోనియా గాంధీ చెవిలో వేసిన మహిళ.. సోనియా, రాహుల్ ఏమన్నారంటే?
2000 నుంచి 2011 వరకు ఆయన బెంగాల్ సీఎంగా వ్యవహరించారు. చాలా కాలం నుంచి ఆయన క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఇతర వయసు రీత్యా వచ్చే సమస్యలతో బాధపడుతున్నారు.
అనారోగ్యంతో ఆయన కొన్నేళ్లుగా ప్రజాజీవితానికి దూరంగా జరిగారు. సీపీఎం పోలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ నుంచి 2015లో తప్పుకున్నారు. 2018లో స్టేట్ సెక్రెటేరియట్ సభ్యత్వం కూడా వదులుకున్నారు.