చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హల్వా ఇచ్చి చంపారంటూ ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోపించారు. విళుపురం జిల్లా కళ్లకురిచ్చి యూనియన్‌ అన్నాడీఎంకే తరఫున పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు ప్రయత్నించామన్నారు.  

అయితే సాధ్యపడలేదని చెప్పారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మను కలిసేందుకు ఎంతో ప్రయత్నించానని కానీ తమను శశికళ అనుమతించలేదని ఆరోపించారు. జయలలితకు మధుమేహం ఉన్నట్టు తెలిసికూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు హల్వా ఇచ్చారని తెలిపారు. 

వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఉద్దేశంతో ఇలా చేశారంటూ మంత్రి షణ్ముగం ఆరోపించారు. ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న ఆమెకు గుండెపోటు ఎలా వస్తుందని అది సాధ్యం కాదన్నారు. గుండెపోటు వస్తే ఆస్పత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని ప్రశ్నించారు. 

ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. విచారించాల్సిన విధంగా శశికళను విచారిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. మరోవైపు టీటీవీ దినకరన్ పై కూడా నిప్పులు చెరిగారు. రెండాకుల గుర్తును నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. దినకరన్  కలలు ఫలించవంటూ మంత్రి సీవీ షణ్ముగం తెలిపారు. జయలలిత మరణంపై మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతున్నాయి.