Asianet News TeluguAsianet News Telugu

అధికారిక లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు : స్టాలిన్

భారత హరిత విప్లవ పితామహుడు , ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సెప్టెంబర్ 30న స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ తెలిపింది. 

tamilnadu cm mk stalin orders a state funeral for MS Swaminathan ksp
Author
First Published Sep 28, 2023, 8:49 PM IST

భారత హరిత విప్లవ పితామహుడు , ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దేశంలో ఆహార భద్రత కోసం స్వామినాథన్ కృషి చేశారని.. వ్యవసాయ రంగానికి ఓ ఐకాన్‌గా నిలిచారని సీఎం ప్రశంసించారు. వ్యవసాయ, పర్యావరణ రంగాలకు ఎనలేని సేవలు చేసిన స్వామినాథన్‌ను గౌరవిస్తూ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్టాలిన్ వెల్లడించారు. సెప్టెంబర్ 30న స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ తెలిపింది. 

కాగా.. 98 ఏళ్ల స్వామినాథన్  చెన్నైలో ఆయన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు.. సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రావులు ఉన్నారు. స్వామినాథన్ సతీమణి మీనా స్వామినాథన్‌ గతేడాది కన్నుమూశారు. ఇక, స్వామినాథన్ 1925 ఆగస్టు 7న కుంభకోణంలో ఎంకే సాంబశివన్, పార్వతి తంగమ్మాళ్ దంపతులకు జన్మించారు. అక్కడే పాఠశాల విద్యను అభ్యసించారు. 

ALso Read: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత..

వ్యవసాయ శాస్త్రంలో ఆసక్తి, మహాత్మా గాంధీ ప్రభావంతో ఎంఎస్ స్వామినాథన్.. వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు.  స్వామినాథన్ భారత్‌లో 'హరిత విప్లవం విజయం కోసం ఇద్దరు కేంద్ర వ్యవసాయ మంత్రులు సి సుబ్రమణ్యం (1964-67), జగ్జీవన్ రామ్ (1967-70,1974-77)తో కలిసి పనిచేశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు, ఇది భారతదేశంలోని తక్కువ-ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది.

వ్యవసాయ రంగంలో స్వామినాథ్ కృషికి గానూ.. ఆయనకు 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ లభించింది. ఈ ప్రైజ్ మనీని చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించడానికి  ఉపయోగించారు. తద్వారా స్థిరమైన, సమగ్ర వ్యవసాయ పద్ధతుల పట్ల తన నిబద్ధతను మరింత సుస్థిరం చేశాడు. ఇక, 1971లో రామన్ మెగసెసే అవార్డ్, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా స్వామినాథన్ అందుకున్నారు. స్వామినాథన్ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వేదికలపై కూడా ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు సహకరించారు. భారత ప్రభుత్వం కూడా స్వామినాథన్‌‌ను 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios