తమిళనాడులో వర్ష బీభత్సం.. 10 మంది మృతి, పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్
తమిళనాడులో వర్షం (tamilnadu rains) దంచికొడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. కానీ ఈ వరద పరిస్థితిని నివేదించేందుకు సీఎం స్టాలిన్ (tamilnadu cm mk stalin).. ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) ని కలిశారు.
Tamil nadu rains : తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టింస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాల వల్ల సంభవించిన పలు ప్రమాదాల్లో వివిధ జిల్లాల్లో 10 మంది మృతి చెందారని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ దాస్ మీనా మంగళవారం తెలిపారు. రెండు రోజుల్లోనే ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేయడం కూడా తప్పు అని ఆమె చెప్పారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివ్ దాస్ మీనా మాట్లాడుతూ.. వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో 10 మంది చనిపోయారని తెలిపారు ఇందులో కొందరు గోడ కూలి ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు విద్యుదాఘాతంతో చనిపోయారని అన్నారు. దక్షిణాది జిల్లాల్లో ముఖ్యంగా తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యిందని, అందుకే వరదలు వచ్చాయని పేర్కొన్నారు.
ఇదిలావుండగా తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కేపీ కార్తికేయన్ జిల్లాలో వరద పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా తిరునల్వేలి, తెన్కాశి జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో పాటు తూత్తుకుడి జిల్లాకు సాధారణ సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా బుధవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రద్దు చేసిన లేదా పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల జాబితాను దక్షిణ రైల్వే విడుదల చేసింది. నాగర్ కోయిల్-కన్యాకుమారి ఎక్స్ ప్రెస్, నాగర్ కోయిల్-తిరునల్వేలి ఎక్స్ ప్రెస్ లను పూర్తిగా రద్దు చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ వరద పరిస్థితులను నివేదించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మిచాంగ్ తుఫాను, దక్షిణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, విపత్తు సహాయ నిధిని అందించాలని కోరారు. తమ రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల్లో వందేళ్ల చరిత్రలో భారీ వర్షాల వల్ల ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదని అన్నారు.
రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన జీవనోపాధి మద్దతు, ప్రజా మౌలిక సదుపాయాల మరమ్మతుల ప్రయత్నాలను పెంచడానికి ఆర్థిక సహాయం అందించాలని ఎంకే స్టాలిన్ ప్రధాని మోడీని కోరారు. తమిళనాడు వరుసగా రెండు విపత్తులను ఎదుర్కొందని, తక్షణ ఉపశమనంగా జాతీయ విపత్తు నిధి నుంచి నిధులు విడుదల చేయాలని అభ్యర్థించారు. తక్షణ ఉపశమనం కోసం రూ.7,300 కోట్లు, శాశ్వత ఉపశమనం కోసం రూ.12,000 కోట్లు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు రూ.6వేలు సాయం ప్రకటించి పంపిణీ చేస్తోందని, పీఎం రిలీఫ్ ఫండ్ వస్తేనే సహాయక చర్యలను పూర్తిగా చేయగలమని అన్నారు.