లాక్ డౌన్ ఎఫెక్ట్: ముగ్గురు పిల్లలను చంపి, చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి
ఉద్యోగం లేకపోవడంతో, లాక్ డౌన్ వేళ ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి లేకపోవడంతో తమిళనాడులో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను అత్యంత దారుణంగా చంపేసి, తాను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చెన్నై: తమిళనాడులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. 37 ఏళ్ల నిరుద్యోగి తన ముగ్గురు పిల్లలను చంపి, తాను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం శ్రీపెరంబుదూరు సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. ఆర్ముగం అనే ఆ వ్యక్తి లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం సంపాదించుకోలేకపోయాడు.
అతని భార్య గోమతి అమ్మాళ్ హౌస్ కీపింగ్ ఉద్యోగిని. లాక్ డౌన్ కాలంలో దాదాపు 50 రోజుల పాటు ఆమెకు ఏ విధమైన వేతనం లేదు. సోమవారంనాడే ఆమె ఉద్యోగానికి వెళ్లింది. ఆర్ముగం తన కూతుళ్లు రాజేశ్వరి (12), శాలిని (10), కుమారుడు సేతురామన్ (8)లను హత్య చేశాడు. రాజేశ్వరిని గొంతు నులిమి చంపేయగా, మిగతా ఇద్దరిని కాళ్లూచేతులూ కట్టేసి నీళ్లలో ముంచి చంపాడు.
పని సంపాదించుకోలేకపోయావని భార్య గోమతి అంటుండడంతో అతను గత కొద్ది రోజులుగా గొడవపడుతూ వస్తున్నాడు. గోమతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ భర్త, పిల్లలు కనిపించేలదు.
రాజేశ్వరి రక్తం మడుగులో పడి ఉండడం కనిపించింది. ఆమె శవం బెడ్ షీట్ లో చుట్టి ఉంది. కూతురిని చూసిన గోమతి కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు వచ్చారు.
వారితో కలిసి ఆమె గాలించింది. ఇంటికి 300 మీటర్ల దూరంలోని ఓ పొలంలో ఆర్ముగం శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అక్కడికి కొద్ది దూరంలోని బావి సమీపంలో తన కుమారుడు సేతురామన్ చొక్కాను గోమతి చూసింది. కొంత మంది గ్రామస్థులు బావిలోకి దూకి శాలిని, సేతురామన్ శవాలను వెలికి తీశారు.