డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళులతో పాటు దేశప్రజలకు అనేక అనుమానాలున్నాయి. ఈ విషయంపై ఎంతోమంది తమ అభిప్రాయాలు తెలియజేశారు.

తాజాగా జయలలితకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ మరణం మిస్టరీలా ఉందని తానెప్పుడో చెప్పానని.. అందుకే దీనిపై విచారణ చేపట్టాలని కోరినట్లుగా సెల్వం తెలిపారు.

జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తాను ఒక్కసారి కూడా వెళ్లి చూడలేదని.. ఆర్ముగస్వామి కమిటీ తనను నాలుగు సార్లు పిలిచారని.. అయితే తను ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా వెళ్లలేకపోయానని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.

అయితే కమిషన్ తనను మరోసారి పిలిస్తే.. కచ్చితంగా వెళతానని ఆయన స్పష్టం చేశారు. 2016 డిసెంబర్ 5న జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.

అయితే దాదాపు 75 రోజుల పాటు అత్యంత రహస్యంగా సాగిన చికిత్స, జయ ఆకస్మిక మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌‌లో ఆర్ముగస్వామి కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.