గవర్నర్ వంటి ఉన్నతమైన హోదాలో కొనసాగే యోగత్య ఆర్ఎన్ రవికి లేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఆయన వ్యవహారంతో రాష్ట్రానికే హాని అని పేర్కొంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా కొనసాగే యోగ్యత ఆర్ఎన్ రవికి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగంపై తీసుకున్న ప్రమాణాన్నే ఆయన ఉల్లంఘించారని, ఆయన వ్యవహారాలు పక్షపాతంగా ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. రాష్ట్ర మంత్రి మండలి నుంచి మంత్రి వీ సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలని గవర్నర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని వివరించారు. ఈ చర్యలే ఆయన గవర్నర్ వంటి ఉన్నత పదవిలో కొనసాగడానికి యోగ్యుడు కాడని తేల్చేస్తున్నాయని పేర్కొన్నారు.
శాంతియుతమైన ఈ రాష్ట్రంలో మత విద్వేషపూరిత ప్రసంగాలు ఆయన చేస్తున్నారని, ఇవి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి హాని కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అనేక బిల్లులను పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ ఆర్ఎన్ రవి పూర్తిగా ఒక రాజకీయ నేతగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి దేశం ఏదో ఒక మతం మీద ఆధారపడక తప్పదని, ఇందుకు భారత్ కూడా మినహాయింపేమీ కాదని ఆయన అనడం ఆయన ఒక రాజకీయ నేతగా వ్యవహరించడాన్ని వెల్లడిస్తుందని వివరించారు.
Also Read: నా దగ్గర కేటీఎం బైక్ ఉంది.. కానీ, నడుపలేను.. ఎందుకంటే?: రాహుల్ గాంధీ
ఆయన ఏ ఎన్నికలను గెలిచి రాలేదని, రాష్ట్ర ప్రజల కోసం నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు ఉండుదని సీఎం స్టాలిన్ తన లేఖలో తెలిపారు. కేవలం ఆయన నియామకం అయ్యారని వివరించారు. ద్రవిడియన్ తత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తి గవర్నర్ పదవిలో కొనసాగడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే, ఆయన కొనసాగేది.. తొలగించే నిర్ణయం పూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే తీసుకోవాలని సీఎం స్టాలిన్ తెలిపారు.
