రాహుల్ గాంధీ తన వద్ద కేటీఎం 390 బైక్ ఉన్నదని చెప్పారు. కానీ, దాన్ని నడుపలేకున్నానని వివరించారు. ఎందుకంటే తన భద్రతా సిబ్బంది బైక్ నడపడానికి అనుమతించరని చెప్పారు. 

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇంకా ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన పలు వర్గాలను సమీపించి వారి పనిలో కలిసిపోతున్నారు. పక్కింటి వ్యక్తిలా మాట కలుపుతున్నారు. మొన్న లారీలో ప్రయాణించడం, మెకానిక్ సర్వీస్ సెంటర్‌లకు వెళ్లి వారితో మాట్లాడటం.. సడెన్‌గా కాన్వాయ్ ఆపి పొలంలోకి దూకి నాటేయడం వంటివి ఇందులో భాగంగానే ఆయన చేస్తున్నారు.

ఇటీవలే ఆయన కరోల్ బాగ్‌లో బైక్ మెకానిక్‌లతో కలిశారు. సాధారణమైన విషయాలను మాట్లాడారు. బైక్ మెకానిక్ అవతారమెత్తారు. కాసేపు వారితో ముచ్చటించి తిరిగి వెళ్లారు. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేశారు.

Also Read: పిల్లల్ని కనాలని విసిగించారు.. పక్కింటి కుటుంబాన్ని హత్య చేసిన వ్యక్తి.. తన భార్యనూ అరెస్టు చేయాలని డిమాండ్

కరోల్ బాగ్ మెకానిక్‌లతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వద్ద కేటీఎం 390 బైక్ ఉన్నదని వెల్లడించారు. తాను ఆ బైక్ పై షికారు చేయాలని అనుకుంటాడని వివరించారు. కానీ, దాన్ని నడపలేకున్నాను అని పేర్కొన్నారు. ఎందుకంటే.. ఆ బైక్ నడపడానికి తన సెక్యూరిటీ సిబ్బంది అనుమతించరని వివరించారు. తాజాగా, ఈ వీడియో పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇంతకు ముందు నిన్న ఆయన ఓ పొలంలో దిగారు. రైతులతో కలిసి వరి నాటేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.